ముగ్గురిపై గ్యాంగ్‌రేప్: బాధితుల్లో బీటెక్ విద్యార్థిని, కానిస్టేబుల్ అభ్యర్థి, గిరిజన మహిళ
కరీంనగర్/ఖమ్మం: రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో దారుణ ఘటనలు చోటు చేసుకుంది. కరీంనగర్ జిల్లాలో ఇద్దరు యువతులు, ఖమ్మం జిల్లాలో ఓ గిరిజన మహిళ అత్యాచారానికి గురయ్యారు. మూడు ఘటనలపై కేసులు నమోదు చేసుకున్న ఆయా ప్రాంతాల పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు.
వివరాల్లోకి వెళితే.. కరీంనగర్ శివారుల్లో దొంగతనాలు, దోపిడీలకు పాల్పడే ముఠాకు నాయకుడుగా ఓ వ్యక్తి చలామణీ అవుతున్నాడు. స్నేహితుడితో కలిసి ఆదివారం రాత్రి ఓ ఇంజినీరింగ్ విద్యార్థిని ద్విచక్రవాహనంపై వెళ్తుండగా గమనించి వెంబడించాడు. విద్యార్థులు ఒకచోట ఆగి మాట్లాడుకుంటుండగా వారిపై దాడిచేశాడు. ఆ తర్వాత విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడ్డాడు.
అంతేగాక, మరో నలుగురు స్నేహితులకు సమాచారం అందించాడు. ఆ వచ్చిన వారు విద్యార్థినిపై అత్యాచారం చేయాలని భావించారు. ఈ క్రమంలో వారి మధ్య ఘర్షణ మొదలైంది. ఇదే సమయంలో విద్యార్థిని స్నేహితుడు తన మిత్రులకు సమాచారం అందజేశాడు. అక్కడికి చేరుకున్న వారు ముఠానేత కాళ్లు, చేయి విరగ్గొట్టారు.
విషయం నిందితుడి అన్నకు తెలియటంతో వెంటనే హైదరాబాద్‌లోని ప్రైవేటు ఆస్పత్రికి, అక్కడి నుంచి గాంధీ ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. వైద్యులు నిందితుడి రెండు కాళ్లూ తొలగించినట్లు తెలిసింది. ఘటన తర్వాత దుండగుల ముఠాకు చెందిన నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది.
సామూహిక అత్యాచారానికి ఒడిగట్టిన ముఠా నాయకుడికి 2009 నుంచి నేరచరిత్ర ఉన్నట్లు సమాచారం. విద్యార్థినిపై అఘాయిత్య ఘటనను ఎస్పీ జోయల్ డేవిస్ ధృవీకరించారు.

ఇది ఇలా ఉండగా, మరో ఘటనలో కరీంనగర్ జిల్లా వీణవంకలో ఇటీవల పోలీసులు కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఉచిత శిక్షణ ఇస్తున్నారు. శంకరపట్నం మండలం ఆముదాలపల్లికి చెందిన గొట్టె శ్రీనివాస్(23), చల్లూరుకు చెందిన యువతి(20) శిక్షణకు హాజరవుతున్నారు. కాగా, వీరిద్దరికి శిక్షణలో పరిచయమైంది. శ్రీనివాస్ వారం క్రితం ఆ యువతిని మాయమాటలతో కాచారం సమీప గుట్ట వద్దకు తీసుకెళ్లాడు.
అనంతరం కల్వల గ్రామానికి చెందిన ముద్దం అంజయ్య(20), ముద్దం రాకేశ్(19)లను పిలిచాడు. వీరు పట్టపగలే యువతిపై అత్యాచారానికి పాల్పడ్డారు. అంతేగాక, ఘటనను సెల్‌ఫోన్‌లో వీడియో తీశారు. ఆపై యువతికి రోజూ ఫోన్‌చేస్తూ, లైంగికవాంఛ తీర్చాలని, లేదంటే వీడియోను నెట్‌లో పెడతామని బెదిస్తుండడంతో ఆ యువతి.. ఆమె కుటుంసభ్యులకు అసలు విషయం చెప్పింది.
దీంతో ఆమె కుటుంబసభ్యులు, గ్రామస్థులు పథకం ప్రకారం నిందితులను బుధవారం సాయంత్రం చల్లూరుకు రప్పించారు. ముగ్గురినీ పట్టుకుని చితకబాదారు. వారి వద్ద సెల్‌ను పరిశీలించగా అత్యాచార చిత్రాలు కనిపించాయి. ఎస్‌ఐ టి కిరణ్ నిందితులను అదుపులోకి తీసుకుని జమ్మికుంట ఆస్పత్రికి తరలించారు.
మూడో ఘటన వివరాల్లోకి వెళితే.. ఉపాధి ఎరవేసి, అమాయక గిరిజన యువతిపై ఐదుగురు వ్యక్తులు సామూహికంగా అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన బుధవారం ఖమ్మం జిల్లా సత్తుపల్లిలోని గుడిపాడు సమీప అటవీ ప్రాంతంలో జరిగింది. పెనుబల్లి మండలంలోని ఓ తాండాకు చెందిన యువతి(22)కి సత్తుపల్లిలో సాయి అనే వ్యక్తి ఫోన్ ద్వారా పరిచయమయ్యాడు.
ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలకడంతో ఆ యువతి బుధవారం మధ్యాహ్నం సత్తుపల్లికి చేరుకుంది. బస్టాండ్‌లో దిగాక ఓ వ్యక్తి సాయి మిత్రుడినని, వెంట తీసుకురమ్మన్నాడని చెప్పి ఆమెను ద్విచక్ర వాహనంపై తామరచెరువు సమీపంలోని అడవిబాట పట్టించాడు.
మత్తుమందు కలిపిన శీతలపానీయం తాగించి, నోట్లో గుడ్డలు కుక్కి ఆమెపై అత్యాచారం చేశాడు. ఆ తర్వాత మరో నలుగురితో అఘాయిత్యాన్ని చేయించాడు. అక్కడ్నుంచి ఎలాగోలా బయటపడిన బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు, ఆమెను ప్రభుత్వాస్పపత్రికి తరలించారు.












Click it and Unblock the Notifications