Hyderabad తోపాటు జిల్లాల్లో భారీ వర్షం: మరో రెండ్రోజులపాటు వర్షాలు
హైదరాబాద్: తెలంగాణలో మరో రెండ్రోజులపాటు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. గురువారం, శుక్రవారం తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. కాగా, బుధవారం రాత్రి రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో, హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.
మాదాపూర్‌లో 5 సెంటిమీటర్లు, గచ్చిబౌలిలో 4.6 సెంటిమీటర్లు, చందానగర్‌లో 4.2 సెంటిమీటర్లు, దండుమైలారంలో 3.8 శాతం వర్షపాతం నమోదైంది. సిద్దిపేట జిల్లా బెజగన్‌లో 12.2 సెంటి మీటర్లు, దుబ్బాక మండలంలోని పోతిరెడ్డిపేటలో 11.2 సెంటి మీటర్లు, కొండపాక, తిప్పారంలో 10.5 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైంది.
నల్గొండ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం కురుస్తోంది. యాదాద్రిలో గురువారం ఉదయం కురిసిన వర్షానికి బాలాలయంలోకి వర్షం నీరు చేరింది. భారీగా నీరు చేరడంతో బాలాలయం చెరువును తలపిస్తోంది. వర్షపు నీటిలోనే కుర్చీలు వేసుకుని అర్చకులు నిత్య పూజలు నిర్వహిస్తున్నారు.

చిట్యాల, నార్కట్‌పల్లి, రామన్నపేట, నకిరేకల్, చుండూరు, మునుగోడు, నాంపల్లి, మర్రిగూడలో భారీ వర్షం కురుస్తోంది. దీంతో రహదారులు జలమయం అయ్యాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఓ మోస్తారు నుంచి భారీ వర్షం కురుస్తోంది. ఉరుములు మెరుపులతో వర్షం కురుస్తుండటంతో పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యాలు తడిసి ముద్దవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
కాగా, తెలంగాణపై 1500 మీటర్ల ఎత్తు వరకూ గాలులు విచ్ఛిన్నత ఏర్పడింది. నైరుతి రుతుపవనాలు గురువారం కేరళలోకి ప్రవేశించే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. వీటి ప్రభావంతోనే గురువారం, శుక్రవారాల్లో తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వెల్లడించింది.












Click it and Unblock the Notifications