ఉజ్జయిని మహంకాళి బోనాలు.. పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం రేవంత్ రెడ్డి
Ujjaini Mahankali Bonalu 2025: సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర ఆదివారం ఘనంగా ప్రారంభమైంది. డప్పు చప్పుళ్లు, పోతురాజుల వీరంగాలు, ఘటాల ఊరేగింపుతో జాతర ప్రారంభమైంది. మహంకాళి అమ్మవారికి తెల్లవారుజామునే మహామంగళ హారతి ఇచ్చి జాతరను ప్రారంభించారు. లష్కర్ బోనాలు అని పిలవబడే ఉజ్జయిని బోనాల జాతర రెండు రోజుల పాటు జరగనుంది. జాతర సందర్భంగా మహంకాళి అమ్మవారిని దర్శించుకునేందుకు ఉదయం నుంచే భక్తులు భారీగా తరలివస్తున్నారు.
పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం రేవంత్..
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సికింద్రాబాద్‌లోని ఉజ్జయిన మహంకాళి బోనాల జాతరకు హాజరయ్యారు. అమ్మవారికి సీఎం రేవంత్ ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డికి ఆలయ అధికారులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం అర్చకులు ముఖ్యమంత్రికి వేదాశీర్వచనాలు ఇచ్చారు. అమ్మవారికి మంత్రి కొండా సురేఖ బోనం సమర్పించుకున్నారు. రాష్ట్రంలో ప్రజలందరికీ మంచి జరగాలని అమ్మవారిని సీఎం రేవంత్ రెడ్డి ప్రార్థించారు. సీఎం రేవంత్‌తో పాటు మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యేలు, తదితరులు అమ్మవారిని దర్శించుకున్నారు.

లష్కర్ బోనాలకు భారీ బందోబస్తు
ఆదివారం లష్కర్ బోనాలతో పాటు ఫలహార బండ్ల ఊరేగింపు నిర్వహిస్తారు. 14న రంగం, పోతరాజుల గావు, అంబారీపై అమ్మవారి ఊరేగింపు నిర్వహించనున్నారు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయం వద్ద భక్తులకు ఇబ్బందులు లేకుండా 6 క్యూలైన్లను ఏర్పాటు చేళశారు. 2500 మంది పోలీసులతో జాతర కోసం భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. లష్కర్ బోనాల సందర్భంగా నేడు, రేపు హైదరాబాద్ లో వైన్ షాపులు బంద్ చేశారు. జాతర నేపథ్యంలో పలు చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.












Click it and Unblock the Notifications