రాజీపడే ప్రసక్తే లేదు - హైదరాబాద్ లో అమిత్ షా..!!
శాంతి భద్రతల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు
శాంతి భద్రతల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. హైదరాబాద్ చేరుకున్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా శుక్రవారం రాత్రి బీజేపీ తెలంగాణ నేతలతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితుల పై ఆరా తీసారు. త్వరలోనే తాను మరోసారి రాష్ట్ర పర్యటనకు వస్తానని స్పష్టం చేసారు. నేషనల్ పోలీస్ అకాడమీలో 74 వ బ్యాచ్ ఐపీఎస్ అధికారుల పాసింగ్ ఔట్ పరేడ్ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది.
ఈ కార్యక్రమానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరై ట్రైనీ ఐపీఎస్‌ల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఉగ్రవాదం, తీవ్రవాదాన్ని పూర్తిగా నిర్మూలించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామని అమిత్ షా చెప్పారు. 8ఏళ్ల క్రితం దేశం అంతర్గత ఆందోళనలతో అట్టుడుకిందని.. కానీ నేడు ఆ పరిస్థితి లేదని అమిత్ షా అన్నారు.
Addressing the ‘Dikshant Parade’ of the IPS probationers of the 74 RR batch at SVPNA, Hyderabad.
— Amit Shah (@AmitShah) February 11, 2023
https://t.co/Fx6rUPfLJm
ప్రజాప్రతినిధులు ఐదేళ్లకోసారి ఎన్నికవుతారని కానీ ఐపీఎస్‌లకు 30 నుంచి 35ఏళ్ల పాటు అధికారం ఉంటుందని షా చెప్పుకొచ్చారు. ప్రతీ ఐపీఎస్ తన బాధ్యతను గుర్తుంచుకుని ముందుకు సాగాలని సూచించారు. ఈ బ్యాచ్‌లో అధికం శాతం టెక్నాలజీ బ్యాక్ గ్రౌండ్ వాళ్ళే ఉన్నారని.. రానున్న కాలంలో టెక్నాలజీ కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు. జాతీయ దర్యాప్తు సంస్థ ప్రస్తుతం దేశ వ్యాప్తంగా విస్తరిస్తోందని అమిత్ షా తెలిపారు.

అదే విధంగా నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో కూడా శరవేగంగా విస్తరిస్తోందని తెలిపారు. ఈ రెండింటి విస్తరణ కారణంగా దేశ వ్యాప్తంగా అనేక నేరాలు అదుపులోకి వచ్చాయని అమిత్ షా తెలిపారు. దేశంలో చాలా చోట్ల విస్తరిస్తున్న పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాపై ఉక్కుపాదం మోపడంలో భారత పోలీసు వ్యవస్థ ఎంతో చాకచక్యంగా వ్యవహరించిన విషయాన్ని అమిత్ షా ప్రస్తావించారు. పీఎఫ్ఐపై ఉక్కుపాదం మోపడం ద్వారా ప్రపంచ దేశాలకు తమ సత్తా ఏమిటో మరోసారి తెలియజేశామని అమిత్ షా అన్నారు.

గత ఎనిమిదేళ్లలో వామపక్ష తీవ్రవాదాన్ని అడ్డుకోవడంతో పాటు పీఎఫ్ఐ ఉగ్రవాద సంస్థను నిషేధించామని చెప్పారు. అదేవిధంగా 2005లో ఆర్థిక వ్యవస్థలో 11వ స్థానంలో ఉన్న దేశాన్ని 5వ స్థానంలోకి నిలబెట్టామన్న షా.. త్వరితగతి దాన్ని కూడా అధిగమించి మూడవ స్థానాన్ని చేరుకుంటుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. జమ్ము కాశ్మీర్ తీవ్రవాదము, ఈశాన్య రాష్ట్రాల్లో ఉగ్రవాదం, వామపక్ష తీవ్రవాదంతో సహా ఎన్నో సమస్యలు ఉండేవని.. అలాంటి సమస్యలన్నింటిని పూర్తిగా కట్టడి చేశామన్నారు.

ఉగ్రవాదానికి వ్యతిరేకంగా జీరో టాలరెన్స్ విధానంపై పని చేశామమన్నారు. టెర్రరిజం, నార్కోటిక్స్, ఆర్ధిక నేరాలు మన దేశంలో లభించే డేటా బేస్ ద్వారా మోనిటర్ చేయడం జరుగుతోందని హోం మంత్రి అమిత్ షా తెలిపారు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి దేశంలో ఉగ్రవాద ముప్పు తగ్గిందని అమిత్ షా తెలిపారు. జమ్ము కశ్మీర్ లో ఉగ్రవాదం అదుపులోనే ఉందని, ఈశాన్య రాష్ట్రాల్లో చొరబాటులు చాలా వరకు తగ్గాయని అమిత్ షా వివరించారు.












Click it and Unblock the Notifications