కరోనా నాలుగో దశ ముప్పు -మళ్లీ అప్రమత్తంగా ఉండాలి : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..!!
కరోనా నాలుగో దశ గురించి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అప్రమత్తం చేసారు. ప్రజలకు కీలక సూచనలు ఇచ్చారు. భూపాలజిల్లాలో పర్యటిస్తున్న ఆయన కరోనా నాలుగో దశ ముప్పు పొంచి ఉన్నందున ప్రజలంతా మళ్లీ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. దేశంలో విద్య, వైద్యం, ఉపాధి పరంగా ఆస్పిరేషన్ జిల్లాలుగా గుర్తించిన చోట్ల మరింత వేగంగా అభివృద్ధి కార్యక్రమాలు జరగాలన్నదే ప్రధాని మోదీ లక్ష్యమని వివరించిన ఆయన కరోనా పరిస్థితుల పైన స్పందించారు. ఆస్పిరేషన్ జిల్లాల్లో భాగంగా తెలంగాణలో భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, అసిఫాబాద్ జిల్లాలను గుర్తించినట్లు వెల్లడించారు.
అందులో భాగంగానే కేంద్ర మంత్రుల పర్యటనలు సాగుతున్నాయని చెప్పుకొచ్చారు. నాలుగో వేవ్ పైన అప్రమత్తం కావాల్సి ఉందని చెబుతూ.. వివాహ వేడుకలు, సమావేశాలు... ఇలా ఎక్కడకు వెళ్లినా మాస్కులు ధరించాలని... నాలుగో దశ నియంత్రణలో ప్రజల సహకారం చాలా ముఖ్యమన్నారు. అదే సమయంలో...కరోనా టీకాలు వేయించుకోని వారు వెంటనే వేయించుకోవాలని సూచించారు. కరోనా దృష్ట్యా ప్రజలందరూ మాస్కులు ధరించాలని పిలుపునిచ్చారు.

కరోనా కట్టడిలో ప్రజల సహకారం ఎంతో అవసరమని చెప్పుకొచ్చారు. ఐదు సంవత్సరాల నుంచి 12 సంవత్సరాల పిల్లలకూ త్వరలోనే వ్యాక్సిన్ ఇవ్వనున్నట్లు కిషన్ రెడ్డి వెల్లడించారు. వెనకబడిన జిల్లాలను అభివృద్ధి చేయాలనేది ప్రధాని లక్ష్యమన్నారు. ప్రధాని ఆదేశాలతో దేశవ్యాప్తంగా వెనకబడిన జిల్లాలను గుర్తించారని వివరించారు. వెనకబడిన జిల్లాల్లో కేంద్రమంత్రులు పర్యటిస్తున్నారని చెప్పారు. రేగొండ పీహెచ్సీలో ప్రజలకు వైద్యసేవలు కార్పొరేట్ ఆసుపత్రిలో బాగా అందుతున్నాయంటూ ప్రశంసించారు. అంతకుముందు కిషన్రెడ్డి... రూపిరెడ్డిపల్లిలో రామాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు.












Click it and Unblock the Notifications