BJPలో రేసులోకి వచ్చిన వారసురాలు!
భారతీయ జనతాపార్టీ తరుచుగా చెప్పే విషయం ఏమిటంటే.. వారసత్వ రాజకీయాలకు తాము వ్యతిరేకం అని. అయితే ఇప్పుడిప్పుడే ఆ పార్టీలో కూడా వారసత్వ రాజకీయాలు క్రమేణా పెరుగుతూ వస్తున్నాయి. ఉత్తరాది రాష్ట్రాల్లో ఎక్కువగా ఉండగా దక్షిణాది రాష్ట్రాల్లో ఇప్పుడిప్పుడే వేళ్లూనుకుంటోంది. తమ పార్టీకి సేవలందించేవారి వారసుల విషయంలో పార్టీ నిర్ణయంలో మార్పు చోటుచేసుకుంటోంది.

అధిష్టానం ఎక్కడ పోటీచేయమంటే అక్కడ పోటీచేస్తా..
విజయ దశమి పర్వదినాన్ని పురస్కరించుకొని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కుమార్తె విజయలక్ష్మి 'అలయ్ బలయ్' కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖులంతా హాజరయ్యారు. ఈ వేదికపై కథానాయకుడు చిరంజీవిని ఫొటో సెషన్ ఆపి రావాలని.. లేదంటే తాను వెళ్లిపోతానని ప్రఖ్యాత ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు వ్యాఖ్యానించడంతో కొద్దిరోజులు వివాదం నడిచి ఇటీవలే సద్దుమణిగింది. గతంలో 'అలయ్ బలయ్' ను దత్తాత్రేయ నిర్వహించేవారు. ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసేవారు. తాను రాజకీయాల్లోకి రావడానికి సిద్ధంగా ఉన్నానని, పార్టీ అధిష్టానం ఎక్కడి నుంచి పోటీచేయమంటే అక్కడి నుంచి పోటీచేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు.

దత్తాత్రేయ అడిగితే కాదనురు?
పార్టీ కోసం తన జీవితాన్నే త్యాగం చేసిన బండారు దత్తాత్రేయ లాంటి వ్యక్తి అడిగితే కచ్చితంగా అధిష్టానం ఒప్పుకుంటుందని ఆయన అనుచరులు చెబుతున్నారు. ఎంపీగానా? ఎమ్మెల్యేగానా? అనేది తేలలేదు. హైదరాబాద్, సికింద్రాబాద్ పరిధిలోని ఏదో ఒక నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీచేయడానికి ఆమె రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. అంతే కాకుండా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సతీమణి కావ్య రానున్న ఎన్నికల్లో అంబర్ పేట నియోజకవర్గం నుంచి పోటీచేయడం ఖాయమంటున్నారు. తాను ఎంపీగా పోటీచేస్తాను కాబట్టి భార్యను కూడా తన నియోజకవర్గం పరిధిలోనే అసెంబ్లీకి పోటీచేయిస్తే గెలుపు సులభమవుతుందని మంత్రి భావిస్తున్నట్లు తెలుస్తోంది.

కృష్ణంరాజు వారుసుడిగా..
మరోవైపు కృష్ణంరాజు తమ్ముడు కుమారుడు, కథానాయకుడు ప్రభాస్ సోదరుడైన ప్రభోద్ ను రానున్న ఎన్నికల్లో ఎంపీగా పోటీచేయించేందుకు రంగం సిద్ధమవుతోంది. నరసాపురం, కాకినాడ, రాజమండ్రిలో ఒక స్థానం నుంచి ఆయన పోటీకి దిగడం ఖాయమని పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఇటీవలే కృష్ణంరాజు కొవిడ్ అనంతర వ్యాధులతో భాద పడుతూ కన్నుమూశారు. ఆయన రాజకీయ వారసుడిగా ప్రభోద్ ను దింపాలని వారి కుటుంబానికి సన్నిహితుడైన కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ భావిస్తున్నారు. ఆయన కోరిక మేరకే ప్రభోద్ ను రంగంలోకి దింపుతున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications