వారెవరూ బ్యాంక్‌ల ముందు నిలబడట్లేదు, అవినీతికి మేం కూడా బాధ్యులమే!: ఉత్తమ్
హైదరాబాద్: రూ.500, రూ.1000 నోట్ల రద్దు పైన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఓ రకంగా, మంత్రి ఈటెల రాజేందర్ మరోరకంగా మాట్లాడుతున్నారని కాంగ్రెస్ పార్టీ నేతలు ఆక్షేపిస్తన్నారు. పెద్ద నోట్ల రద్దును ఈటెల స్వాగతించారు. పెద్ద నోట్ల రద్దుతో తెలంగాణకు నష్టమని కేసీఆర్ వాపోతున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పైవిధంగా స్పందించింది.
నల్లధనం పోతుందో లేదో కానీ ప్రజలు మాత్రం అవస్థలు పడుతున్నారని తెలంగాణ పీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి మంగళవారం నాడు ఆవేదన వ్యక్తం చేశారు. బ్యాంకుల ముందు నిలబడిన వారిలో నల్లధనం ఉన్న వారు ఎవరూ కనిపించడం లేదన్నారు.
విదేశాలలో ఉన్న నల్లధనాన్ని తీసుకు రావడంలో ఎందుకు విఫలమయ్యారో కేంద్రం చెప్పాలని ప్రశ్నించారు. పెద్ద నోట్ల వల్లే నల్లధనం పెరుగుతుందనుకుంటే రూ.2000 నోటు ఎందుకో చెప్పాలని నిలదీశారు.

రాజకీయ అవినీతికి తాము కూడా కొంత బాధ్యులమేనని, అంతా కలిసి రాజకీయ అవినీతిని పారదోరాలన్నారు. బ్యాంకింగ్ వ్యవస్థలో కూడా కొన్ని లోపాలు ఉన్నాయని, నల్లధనాన్ని అరికట్టాలంటే భారీగా నగదు ఉపసంహరణపై నియంత్రణ ఉండాలన్నారు.
రూ.100 కోట్లు మాత్రమే ఉండాలి: విమలక్క
పెద్ద నోట్ల రద్దు వల్ల సామాన్య ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, రూ.2000 నోట్లు ఇస్తే చిల్లర కూడా దొరకడం లేదని అరుణోదయ నాయకురాలు విమలక్క అన్నారు. ఇది ఒక పొలిటికల్ గేమ్ అని ఆమె అన్నారు. రూ.500, రూ.2000 నోట్లు కూడా వద్దని, కేవలం రూ.100 మోట్లు మాత్రమే ఉండాలన్నారు.












Click it and Unblock the Notifications