ఎక్కడికెళ్ళినా విజయశాంతికి కష్టాలు తప్పట్లేదా? బీజేపీలోనూ పక్కన పెట్టేసినట్టేనా.. రాములమ్మ కింకర్తవ్యం!!
మాజీ ఎంపీ, బీజేపీ సీనియర్ నేత విజయశాంతి కి ఎక్కడికి వెళ్ళినా కష్టాలు తప్పడం లేదా? ప్రతి పార్టీలోనూ విజయశాంతి, పార్టీ కోసం కీలకంగా పనిచేసినా ఆమెను పక్కకు నెట్టేస్తున్నారా? రాజకీయాల్లో రాణించాలని ప్రయత్నిస్తున్న రాములమ్మను పైకి రానివ్వకుండా అడ్డుకుంటున్నారా? ప్రస్తుతం తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయం బీజేపీ అని చెబుతున్న క్రమంలో, బిజెపిలో ఉన్నప్పటికీ రాష్ట్ర రాజకీయాల్లో కీలకపాత్ర పోషించకుండా విజయశాంతి సైలెంట్ గా ఉండడం వెనుక బండి సంజయ్ పాత్ర ఉందా? అసలు విజయశాంతి విషయంలో ఏం జరుగుతుంది? అన్న ప్రశ్నలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారాయి.

విజయశాంతి రాజకీయ ప్రస్తానం ..
సినీరంగంలో తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్న విజయశాంతి 1998వ సంవత్సరంలో రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు ఆమె పెద్దగా రాణించిన దాఖలాలు కనిపించలేదు. 1998 వ సంవత్సరంలో విజయశాంతి మొదట్లో భారతీయ జనతా పార్టీలో చేరారు. ఆ తర్వాత 2005 సంవత్సరంలో తల్లి తెలంగాణ పార్టీని ఏర్పాటు చేసి తెలంగాణ రాష్ట్ర సాధన దిశగా అడుగులు వేశారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాటం చేస్తున్న టిఆర్ఎస్ పార్టీలో తల్లి తెలంగాణ పార్టీని విలీనం చేసి ఆమె కూడా టీఆర్ఎస్లో చేరారు. మొదట్లో కెసిఆర్ విజయశాంతికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్టు కనిపించినా, క్రమక్రమంగా విజయశాంతి ప్రాధాన్యత పార్టీలో తగ్గుతూ వచ్చింది. ఆ తర్వాత విజయశాంతిని 2013లో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలలో పాల్గొంటున్నారని టిఆర్ఎస్ పార్టీ నుండి సస్పెండ్ చేశారు.

టీఆర్ఎస్, కాంగ్రెస్ లలో విజయశాంతికి చుక్కెదురు .. బీజేపీ లో చేరిన రాములమ్మ
ఆపై ఆమె 2014 సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2014లో మెజార్టీ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసిన విజయశాంతి ఓటమి పాలయ్యారు. ఇక మొదట్లో కాంగ్రెస్ పార్టీలోనూ కొంచెం కీలకంగా కనిపించిన విజయశాంతి ప్రభావం ఆపై తగ్గుతూ వచ్చింది. కాంగ్రెస్ పార్టీలో విజయశాంతికి రాష్ట్ర ముఖ్య నాయకులు స్థానం కల్పించకపోవడంతో, సరైన ప్రాధాన్యం ఇవ్వకపోవడంతో తీవ్ర అసంతృప్తితో కాంగ్రెస్ పార్టీలో చాలా కాలం పాటు కొనసాగిన విజయశాంతి, ఆ తర్వాత 2020 వ సంవత్సరంలో డిసెంబర్ 7వ తేదీన భారతీయ జనతా పార్టీలో చేరింది.

బీజేపీలో చేరిన మొదట్లో రాములమ్మ దూకుడు.. ఆపై పక్కన పెట్టారని ఫైర్
ఇక బిజెపిలో చేరిన తొలినాళ్లలో విజయశాంతి దూకుడుతో టిఆర్ఎస్ ప్రభుత్వం పై విరుచుకుపడింది. విజయశాంతికి బీజేపీలోనూ మొదట్లో బాగానే ప్రాధాన్యత లభించింది. క్రమక్రమంగా బిజెపి లోనూ విజయశాంతి ప్రభావం తగ్గుతూ వచ్చింది. ఈ విషయాన్ని విజయశాంతినే స్వయంగా వెల్లడించింది కూడా. సర్దార్ సర్వాయి పాపన్న జయంతి వేడుకల సాక్షిగా వేదికపై తనను మాట్లాడనివ్వలేదని, తనను పక్కన పెట్టారని విజయశాంతి ఆరోపించింది. తనను ఎందుకు మాట్లాడనివ్వలేదో బీజేపీ నేతలను అడగాలని పేర్కొన్న విజయశాంతి బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీరుపై అసహనం వ్యక్తం చేసింది.

పార్టీలో ఘోరంగా మారిన రాములమ్మ స్థానం
పార్టీ కోసం తన సేవలను ఎలా ఉపయోగించుకుంటారో బండి సంజయ్, లక్ష్మణ్ లకే తెలియాల్సి ఉందని విజయశాంతి పేర్కొంది. పార్టీ బాధ్యతలు ఏమైనా ఇస్తే చేస్తానని .. ఇవ్వకుండా ఎలా చేయాలని ప్రశ్నించిన విజయశాంతి పార్టీలో తన పరిస్థితిని తానే నేరుగా వెల్లడించింది. ఇక బండి సంజయ్ విజయశాంతికి పార్టీలో ప్రాధాన్యత తగ్గించారన్న చర్చ జరుగుతుంది.ఇక తాజాగా బిజెపి అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్వహించిన మునుగోడు ఉప ఎన్నికల సమయంలో కూడా విజయశాంతి కీలక భూమిక పోషించలేదు.

పార్టీ కార్యక్రమాలకు దూరంగా విజయశాంతి
మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో విజయశాంతి కనిపించిన దాఖలాలు లేవు. బిజెపిలో చేరిన తొలినాళ్లలో టిఆర్ఎస్ ప్రభుత్వం పై విరుచుకుపడిన విజయశాంతి, ప్రస్తుతం సైలెంట్ గా తెలంగాణ లో జరుగుతున్నది చూస్తున్నారు. అడపాదడపా ప్రభుత్వ నిర్ణయాలపై మాట్లాడ్డం మినహాయించి, పార్టీకి సంబంధించిన మిగతా కార్యక్రమాలలో విజయశాంతి పాల్గొంటున్న పరిస్థితి కూడా కనిపించటంలేదు.

ఎక్కడికి వెళ్ళినా రాములమ్మకు తప్పని కష్టాలు
మొత్తానికి ఎక్కడికి వెళ్లినా విజయశాంతికి కష్టాలు తప్పడం లేదని, ఇటు బీజేపీ లోనూ పక్కన పెట్టిన పరిస్థితి కనిపిస్తోందని, మరి ఇటువంటి పరిస్థితుల్లో రాములమ్మ ఏం చేయాలన్న సందిగ్ధంలో ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే దాదాపు అన్ని ముఖ్యమైన పార్టీలన్నీ మారిన రాములమ్మ, ఇప్పుడు వేరే పార్టీలోకి వెళ్లలేని పరిస్థితి ఉంది. ఇక ఇదే పార్టీలో ఉంటూ ప్రాధాన్యత లేకుండా మనుగడ సాగించటం కూడా కష్టంగా మారింది. మొత్తానికి ప్రస్తుతం విజయశాంతి పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యి లా ఉంది.












Click it and Unblock the Notifications