చంద్రబాబే కారణం! టీడీపీతో వెళితే భారీ నష్టం తప్పదు: విజయశాంతి వార్నింగ్
హైదరాబాద్: తెలంగాణలో తెలుగుదేశం పార్టీతో కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకుంటుందనే చర్చ గత కొద్ది రోజులుగా జరుగుతున్న విషయం తెలిసిందే. టీడీపీ, కాంగ్రెస్ పొత్తులపై ఇరు పార్టీల నేతలు కూడా సానుకూలంగానే వ్యాఖ్యలు చేస్తుండటం గమనార్హం.
రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ పదవికి జరిగిన ఎన్నికల్లో టీడీపీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి మద్దతివ్వడం ఇందుకు మరింత బలం చేకూర్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎలావున్నా.. తెలంగాణలో మాత్రం కాంగ్రెస్ పార్టీతో కలిసి ఎన్నికలకు పోవాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు భావిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

విజయశాంతి హెచ్చరిక.. రాహుల్‌కు లేఖ?
ఇది ఇలా ఉండగా, టీడీపీతో పొత్తు ప్రతిపాదనను కాంగ్రెస్ మహిళా నేత విజయశాంతి వ్యతిరేకిస్తున్నట్లు తెలిసింది. టీడీపీతో పొత్తు పెట్టుకుంటే భారీ నష్టం తప్పదని ఆమె హెచ్చరించినట్లు సమాచారం. అంతేగాక, ఈ మేరకు కాంగ్రెస్ అధినేత రాహుల్‌కి లేఖ రాసే యోచనలో విజయశాంతి ఉన్నట్లు తెలిసింది.

చంద్రబాబే కారణమంటూ..
రాష్ట్ర విభజన అనంతరం చాలా సమస్యలు పరిష్కారం కాకపోవడానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబే కారణమని విజయశాంతి ఆరోపిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో టీడీపీతో పొత్తు పెట్టుకుంటే నష్టపోతామని విజయశాంతి మెదక్ జిల్లా కాంగ్రెస్ నేతల వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిసింది.

తీవ్రనష్టం తప్పదంటూ వాపోయిన విజయశాంతి
ప్రస్తుతం చావో రేవో అన్నట్లుగా ఉన్న ఈ పరిస్థితుల్లో కొందరు పార్టీ నేతలు కాంగ్రెస్ అధిష్టానాన్ని తప్పుదోవపట్టిస్తున్నారని విజయశాంతి వాపోయారట. టీడీపీతో పొత్తు వల్ల ముఖ్యంగా కరీంనగర్, వరంగల్, నిజామాబాద్ జిల్లాల్లో తీవ్ర నష్టం తప్పదని విజయశాంతి హెచ్చరించినట్లు తెలిసింది.

ఉబలాటమెందుకు?
దరాబాద్‌లో కొన్ని సీట్లు గెలుస్తామన్న భావనలో ఉన్న కొందరు కాంగ్రెస్ నేతలు టీడీపీతో పొత్తు కోసం ఉబలాటపడుతున్నారని విజయశాంతి వ్యాఖ్యానించినట్లు తెలిసింది. ఈ విషయాలన్నింటిని ప్రస్థావిస్తూ త్వరలో రాహుల్ గాంధీకి లేఖ రాయాలని విజయశాంతి నిర్ణయించుకున్నట్లు తెలిసింది. ఓ వైపు పొత్తు కోసం ఇరుపార్టీల నేతలు దాదాపు సానుకూల ప్రకటనలు చేస్తుంటే.. విజయశాంతి తాజా వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.












Click it and Unblock the Notifications