తెలంగాణలో ఆ రైల్వే స్టేషన్‌కు నూతన కళ: మారుతున్న ముఖచిత్రం
తెలంగాణలోని ఆ రైల్వే స్టేషన్ ముఖచిత్రం సమూలంగా మారిపోతోంది. అత్యాధునిక వసతులను సంతరించుకుంటోంది. ప్రయాణికులకు ఓ నూతన అనుభూతిని పంచనుంది. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద ఇక్కడ మౌలిక సదుపాయాల కల్పన, ఆధునికీకరణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఈ క్రమంలో కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జీ కిషన్ రెడ్డి.. ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డితో కలిసి ఈ రైల్వే స్టేషన్‌ను సందర్శించారు. అభివృద్ధి పనులపై ఆరా తీశారు.
అదే..వికారాబాద్ రైల్వే స్టేషన్. పునర్నిర్మాణ పనుల్లో భాగంగా ఇక్కడ 12 మీటర్ల వెడల్పు గల భారీ ఫుట్ ఓవర్ బ్రిడ్జి సివిల్ పనులు తుది దశకు చేరుకున్నాయి. ప్రయాణికులు ఒక ప్లాట్‌ఫాం నుంచి మరో ప్లాట్‌ఫాంకు సులభంగా వెళ్లేందుకు వీలుగా లిఫ్టులు, ఎస్కలేటర్లకు సంబంధించిన పనులను శరవేగంగా సాగుతున్నాయి. సికింద్రాబాద్ డివిజనల్ రైల్వే మేనేజర్ డాక్టర్ ఆర్ గోపాలకృష్ణన్‌తో పాటు రైల్వే ఉన్నతాధికారులు మంత్రి కిషన్ రెడ్డికి పనుల పురోగతిని వివరించారు.

ప్రయాణికుల సౌకర్యార్థం స్టేషన్‌లోని పాత వెయిటింగ్ హాళ్లు, టాయిలెట్ బ్లాకులను అత్యాధునిక హంగులతో పునరుద్ధరిస్తోన్నారు. వీటితో పాటు అదనంగా ప్రయాణికుల కోసం ఎగ్జిక్యూటివ్ వెయిటింగ్ హాల్, ప్రత్యేక వీఐపీ లాంజ్‌ను కూడా నిర్మిస్తున్నారు. టికెట్ జారీ ప్రక్రియను మరింత సరళతరం చేయడానికి ఓ నూతన బుకింగ్ ఆఫీస్ కూడా ఇక్కడ అందుబాటులోకి రాబోతోంది. అలాగే.. ప్రయాణికుల కోసం అత్యాధునిక కేఫెటేరియా సౌకర్యం కూడా ఇక్కడ రాబోతోంది.

స్టేషన్ వెలుపలి భాగాన్ని కూడా అత్యంత ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతున్నారు. కాంకర్స్ ఏరియాతో పాటు వాహనాల పార్కింగ్, ప్రయాణికులు దిగడానికి వీలుగా పోర్టికో పనులు శరవేగంగా సాగుతున్నాయి. వికారాబాద్ రైల్వే స్టేషన్ పునర్నిర్మాణం పూర్తయితే ఇది ఈ ప్రాంతంలోనే అత్యంత ఆధునిక రవాణా కేంద్రంగా మారనుంది.
తన పర్యటన సందర్భంగా జీ కిషన్ రెడ్డి వికారాబాద్ స్టేషన్ ప్రాంగణంలో మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణ దిశగా ప్రతీ ఒక్కరూ బాధ్యతగా సాగాలని ఆయన ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. అనంతరం స్టేషన్‌లో అమృత్ పథకం పురోగతిపై రూపొందించిన ఫొటో ఎగ్జిబిషన్ ను తిలకించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ వ్యాప్తంగా రైల్వే నెట్‌వర్క్ ఆధునికీకరణకు కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని పునరుద్ఘాటించారు.
వికారాబాద్ మాత్రమే కాకుండా రాష్ట్రంలోని పలు కీలక స్టేషన్లను అమృత్ భారత్ పథకం కింద సమూలంగా మార్చివేస్తున్నట్లు వివరించారు. ప్రయాణికుల భద్రత, వేగం, సౌకర్యాలే లక్ష్యంగా దక్షిణ మధ్య రైల్వే అనేక కొత్త ప్రాజెక్టులను చేపట్టిందని తెలిపారు. ఈ ప్రాంత ప్రయాణికుల చిరకాల స్వప్నాన్ని నెరవేరుతోందని, అత్యాధునిక మౌలిక వసతులు అందుబాటులోకి రావడం వల్ల సాధారణ ప్రయాణికులతో పాటు వ్యాపార వర్గాలకు కూడా ఎంతో ప్రయోజనం చేకూరుతుందని అన్నారు.














Click it and Unblock the Notifications