Bullet Bandi song : బుల్లెట్ బండి పాటకు నర్సు డ్యాన్స్ వైరల్... ఇంతలోనే ఆమెకు ఊహించని షాక్...
'నీ బుల్లెట్ బండెక్కి వచ్చేత్తపా...' ఇప్పుడెక్కడ విన్నా ఇదే పాట మార్మోగుతోంది. అటు సోషల్ మీడియాను,ఇటు యూత్‌ను షేక్ చేస్తోంది. పాట వింటే చాలు చాలామంది కాలు కదపకుండా ఉండలేకపోతున్నారు. అంతలా ఆ బీట్,లిరిక్స్ జనాలను ఉర్రూతలూగిస్తున్నాయి. ఇటీవలే సాయి శ్రీయ అనే ఓ నవ వధువు పెళ్లి బరాత్‌లో ఈ పాటకు చేసిన డ్యాన్స్ సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారిన సంగతి తెలిసిందే. ఆమె స్టెప్పులకు అంతా ఫిదా అయిపోయారు. ఆమె లాగే ఓ నర్సు కూడా బుల్లెట్ బండి పాటకు స్టెప్పులేసి ఇంటర్నెట్‌లోకి ఎక్కారు. అయితే సదరు నర్సుకు ఊహించని షాక్ తగిలింది.
ఆ నర్సు పేరు జ్యోతి. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని తంగళ్లపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కాంట్రాక్ట్ నర్సుగా పనిచేస్తోంది. ఇటీవల పీహెచ్‌సీలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల అనంతరం నర్సులంతా కలిసి సరదాగా గడిపారు. ఈ సందర్భంగా జ్యోతి 'నీ బుల్లెట్ బండెక్కి వచ్చేత్తపా...' అనే పాటకు స్టెప్పులేసి అందరినీ ఆకట్టుకున్నారు. తాజాగా ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఈ వీడియో జిల్లా వైద్య ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో ఆమెకు మెమో జారీ అయింది.నర్సు జ్యోతి వివరణ తర్వాత ఆమెపై చర్యలు తీసుకోవాలా వద్దా అనేది తేల్చనున్నారు.

మరోవైపు ఆ నర్సుకు మెమో జారీ చేయడంపై నెటిజన్లు మండిపడుతున్నారు. అందులో తప్పు పట్టాల్సిందేమీ లేదని అంటున్నారు. ఆమె విధుల్లో ఉండగా డ్యాన్స్ చేస్తే తప్పవుతుంది గానీ విరామ సమయంలో చేయడం తప్పెలా అవుతుందని ప్రశ్నిస్తున్నారు. మరికొందరు మాత్రం ఆస్పత్రిలో ఇలాంటివి అవసరమా అని మండిపడుతున్నారు.
ఏదేమైనా బుల్లెట్ బండి పాట జనాల్లోకి అమితంగా చొచ్చుకెళ్లింది. పెళ్లి బరాత్‌లో సాయి శ్రీయ చేసిన డ్యాన్స్ ఆ పాటకు రూపమిచ్చినట్లయింది. ఆమె నేచురల్ పెర్ఫామెన్స్‌కి జనం ముగ్ధులైపోయారు. చాలామంది ఆ పాటను,వీడియోను రిపీట్ మోడ్‌లో చూస్తూ,వింటూనే ఉన్నారు. ఇప్పుడప్పుడే ఈ పాట మత్తు జనాలను వదిలేలా కనిపించట్లేదు. ఈ పాటను పాత మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన లక్ష్మణ్ అనే గేయ రచయిత రాశారు. మోహన భోగరాజు అనే సింగర్ పాడారు. యూట్యూబ్‌లో ఇప్పటికే ఈ పాటు 30 మిలియన్లు దాటేసింది.












Click it and Unblock the Notifications