ఓరుగల్లుకు మహర్దశ.. హైదరాబాద్ కు ధీటుగా దూసుకుపోనున్న కాకతీయుల రాచనగరి!!
ఉమ్మడి వరంగల్ జిల్లాను హైదరాబాద్ కు ధీటుగా అభివృద్ధి చేస్తామని, ఈ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారని వరంగల్ జిల్లా ఇన్చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. వరంగల్ నగర సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా అధికారులు పని చేయాలన్నారు.
వరంగల్ నగర, సమగ్రాభివృద్ధిపై మంత్రి పొంగులేటి సమీక్ష
సచివాలయంలో వరంగల్ నగర అభివృద్ధిపై దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ తో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో వరంగల్ నగర సమగ్ర ప్రగతికి, ఉమ్మడి వరంగల్ జిల్లా అభివృద్ధికి సంబంధించిన అనేక అంశాల పైన చర్చించారు. స్మార్ట్ సిటీ, మెగా టెక్స్ టైల్ పార్కు, భద్రకాళి దేవస్థానం, వరంగల్ ఎయిర్ పోర్టు, నర్సంపేటలో ప్రభుత్వ మెడికల్ కాలేజీ, సమీకృత రెసిడెన్షియల్ స్కూల్స్ తదితర అంశాలపై సమీక్షించారు.

వారి అభిప్రాయాల మేరకే పనులు
హైదరాబాద్ నగరానికి ధీటుగా వరంగల్ ను అభివృద్ధి పరచాలన్న కృతనిశ్చయంతో వరంగల్ నగర అభివృద్ధిపై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారని అన్నారు. వరంగల్ నగర అభివృద్ధికి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల అమలులో వేగం పెంచాలని, ప్రజలకు అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అభివృద్ధి పనుల ఎంపికలో స్థానిక ప్రజాప్రతినిధుల అభిప్రాయాలకు అనుగుణంగానే పనులను చేపట్టాలని అధికారులకు సూచించారు.
కీలక పనులపై అధికారులకు ఆదేశం
వరంగల్ ఇన్నర్ రింగ్ రోడ్డు, ఔటర్ రింగ్ రోడ్డు, ఎయిర్ పోర్ట్ ల కోసం రైతులు సంతృప్తి చెందేలా భూసేకరణను చేపట్టాలని అధికారులకు సూచించారు. ఎయిర్ పోర్ట్ భూసేకరణ కోసం ఎయిర్ పోర్ట్ అథారిటి, ఆర్&బి అధికారులతో సమావేశం కావాలని వరంగల్ జిల్లా కలెక్టర్ ను ఆదేశించారు. స్మార్ట్ సిటీ ప్రాజెక్టు పనులను ఈ యేడాది డిసెంబర్ 31వ తేదీలోగా పూర్తి చేసేలా ప్రణాళికలు తయారు చేసుకోవాలని అధికారులకు సూచించారు.
మెడికల్ కాలేజీ త్వరలో ప్రారంభం
కాళోజీ కళాక్షేత్రం పనులను ఈ నెల 20వ తేదీ నాటికి పూర్తి చేయాలని వచ్చే నెలలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాళోజి కళాక్షేత్రాన్ని ప్రారంభిస్తారని తెలిపారు.నర్సంపేట మెడికల్ కాలేజి లో అడ్మిషన్స్ ను ఈ ఏడాది నుంచే ప్రారంభించేలా చర్యలు తీసుకున్న వైద్య శాఖ అధికారులను పొంగులేటి అభినందించారు. ఈ నెల మూడవ వారంలో రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభిస్తామని మంత్రి వెల్లడించారు.
భద్రకాళీ ఆలయ మాడ వీధుల నిర్మాణం పై సూచనలు
చారిత్రాత్మక భద్రకాళీ దేవస్థానం అభివృద్ధి పనులను ఆగమ శాస్త్ర ప్రకారం నిర్మాణాలు చేపట్టాలని అధికారులకు సూచించారు. మాడవీధుల నిర్మాణంతో పాటు ఆలయం చుట్టూ రాతి బేస్మెంట్ నిర్మిస్తున్నట్టు తెలిపారు. కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్కు పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. భూములు కోల్పోయిన వారికి కాలనీలు నిర్మించే విషయంలో తగిన ప్రణాళికలు చెయ్యాలని ఆదేశించారు.
టెక్స్ టైల్స్ పార్క్ పనులపై ఆదేశం
ఈ టెక్స్ టైల్ పార్కులో ఇప్పటివరకు ఎంతమంది పరిశ్రమల ఏర్పాటుకు ఒప్పందం చేసుకున్నారు, ఎన్ని కంపెనీలకు ఎంత భూములను కేటాయించారు, ఎన్ని పరిశ్రమలు ప్రారంభయ్యాయి, ఎంతమందికి ఉపాధి కల్పించారు వంటి వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. దీనిపై పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి తో సమావేశం ఏర్పాటు చేసి మరింత లోతుగా అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించారు.
ఖమ్మం, వరంగల్ మధ్యలో డంపింగ్ యార్డుకు భూసేకరణ
అంతేకాదు ఖమ్మం, వరంగల్ మధ్యలో డంపింగ్ యార్డు ఏర్పాటు చేయాలని ఇందుకు అవసరమైన భూమిని సేకరించాలని అధికారులకు సూచించారు. ఉమ్మడి వరంగల్ జిల్లా సమగ్ర అభివృద్ధికి అధికారులు చురుగ్గా పనిచేయాలని మంత్రి పొంగులేటి ఆదేశించారు.












Click it and Unblock the Notifications