కొండా సురేఖ రాజీనామా వెనుక కథ వేరే.. ఆమె అసహనం వెనుక వరంగల్ రాజకీయం!!
వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని వరంగల్ జిల్లాలో చక్రం తిప్పాలని భావించిన కొండా సురేఖకు తాజాగా కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన కొత్త కమిటీలు షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఏఐసిసి రిలీజ్ చేసిన కమిటీల జాబితాలో తన జూనియర్ల కంటే తనకు తక్కువ స్థానం కల్పించారని కొండా సురేఖ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తూ టిపిసిసి ఎగ్జిక్యూటివ్ కమిటీకి రాజీనామా చేశారు. ఇక ఈ మేరకు తనకు బాధ కలిగించే అంశాలపై టీపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కి లేఖ రాసిన కొండా సురేఖ పిసిసి ఎగ్జిక్యూటివ్ కమిటీ పదవికి రాజీనామా చేయడం వెనుక అనేక రాజకీయ కారణాలు ఉన్నాయని తెలుస్తోంది.
రాజశ్యామల యాగం సాక్షిగా కవితకు లిక్కర్ కుంభకోణంతో సంబంధం లేదని ప్రమాణం చెయ్ కేసీఆర్!!

వరంగల్ డీసీసీ తమవారికి కావాలని కొండా సురేఖ పట్టు
వచ్చే ఎన్నికల్లో వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలోకి దిగాలని భావిస్తున్న కొండా సురేఖ, ఈ మేరకు వరంగల్ కేంద్రంగా రాజకీయాలు చేయడం కోసం, వరంగల్ డిసిసి అధ్యక్షుడిగా తమ ప్రధాన అనుచరునికి అవకాశం కల్పించాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని కోరినట్లు తెలుస్తోంది. కనీసం టిపిసిసి ప్రధాన కార్యదర్శి పదవి అయినా ఇవ్వాలని కోరినట్టు సమాచారం. అయితే వరంగల్ డిసిసి అధ్యక్ష పదవి పై కొండా మురళి దొంతి మాధవ రెడ్డి మధ్య పోటీ నెలకొందని తెలుస్తుంది.

వరంగల్ తూర్పు నాయకుడి పేరు ప్రతిపాదన .. జనగామ జంగా కోసం ప్రయత్నాలు
ఈ క్రమంలోనే వరంగల్ తూర్పు లో తమకు అనుచరుడిగా ఉన్న ముఖ్య నాయకుడి పేరును కొండా సురేఖ డిసిసి అధ్యక్షుడిగా అవకాశమివ్వాలని ప్రతిపాదించినట్లు తెలుస్తోంది .ఇక మరోవైపు జనగామ డిసిసి అధ్యక్ష పదవి కోసం జంగా రాఘవరెడ్డి కి, కొమ్మూరి ప్రతాప్ రెడ్డి కి మధ్య పోటీ ఉంది. కొండా వర్గీయుడైన జంగా రాఘవరెడ్డికి డిసిసి అధ్యక్ష పదవి ఇవ్వాలని కొండా సురేఖ తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే తాజాగా ప్రకటించిన డీసీసీ అధ్యక్షుల జాబితాలో తాము అడిగిన కొన్ని స్థానాలను పెండింగ్ లో పెట్టటం, అలాగే ప్రధాన కార్యదర్శులు, టీపీసీసీ ఉపాధ్యక్షులుగా తమ వారికి అవకాశం కల్పించకపోవటం కొండా సురేఖను తీవ్ర అసంతృప్తికి గురి చేశాయి.

అసంతృప్తికి , ఆమె చెప్పిన కారణం వెనుక జిల్లా రాజకీయం
ఇక ఈ క్రమంలోనే తాజాగా ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ ప్రకటించిన పదవుల జాబితాపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. ఏఐసీసీ ప్రకటించిన పదవులపై అసంతృప్తి కలిగిందని ఈ లేఖ ద్వారా కొండా సురేఖ పేర్కొన్నారు. తాను నాలుగుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి మంత్రిగా పని చేశానని, తన భర్త కొండా మురళి రెండుసార్లు శాసనమండలి సభ్యులుగా ఎన్నికయ్యారు అని, ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా తమకు అభిమానులు, కార్యకర్తలు ఉన్నారని కొండా సురేఖ పేర్కొన్నారు.

పెండింగ్ లో వరంగల్, జనగామ డీసీసీ.. ఏం జరుగుతుందో?
ఇంకా వరంగల్, జనగామ భూపాలపల్లి డీసీసీ అధ్యక్షుల నియామకం పెండింగ్లో పెట్టిన క్రమంలో కొండా సురేఖ తనకు స్థానం కల్పించిన పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ కి రాజీనామా చేయడం ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. కొండా సురేఖను బుజ్జగించడానికి ఆమె కోరినట్టు ఆమె అనుచరులకు అవకాశం కల్పించి కాంగ్రెస్ పార్టీ ఆమెను అనునయించటం కోసం ప్రయత్నం చేస్తుందా? అనేది తెలియాల్సి ఉంది.












Click it and Unblock the Notifications