నీటి వివాదాల మీటింగ్ కు సీఎం కేసీఆర్..!! జగన్ సైతం సిద్దమేనా - ఏం జరగబోతోంది..!!
రెండు తెలుగు రాష్ట్రాల నీటి వివాదాల పైన చర్చించేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేరుగా రంగంలోకి దిగాలని నిర్ణయించారు. అందు కోసం కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) సెప్టెంబరు 1న నిర్వహించే సమావేశానికి హాజరు కావాలని సీఎం కేసీఆర్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే పలు మార్లు నీటి వివాదాలు-తెలంగాణ వైఖరి పైన ముఖ్యమంత్రి అధికారులతో సమీక్ష చేసారు. కీలక సూచనలు చేసారు. ఇక, కేంద్రం తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసిన తరువాత దాని పైన ఏపీ ప్రభుత్వం స్వాగతించింది. కొద్ది పాటి మార్పులు సూచిస్తోంది.

కేఆర్ఎంబీ మీటింగ్ కు కేసీఆర్ హాజరవుతారా..
అదే సమయంలో తెలంగాణ ప్రభుత్వం కేంద్రం జారీ చేసిన నోటిఫికేషన్ పైన అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఇక, రెండు రాష్ట్రాల మధ్య ఉన్న నీటి పంచాయితీల పైన కృష్ణా నదీ యాజమాన్య బోర్డు నిర్వహించే సమావేశానికి తానే వస్తానని కేసీఆర్ చెప్పటం తో పాటుగా అధికారులను సంసిద్దులను చేస్తున్నారు. దీంతో..మరి ఏపీ సీఎం వైఖరి ఏంటనే చర్చ మొదలైంది. సహజంగా కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే అపెక్స్ కౌన్సిల్ సమావేశానికి ముఖ్యమంత్రులు హాజరవుతారు. అయితే, ఇప్పుడు కేసీఆర్ కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశానికే వస్తానని చెప్పటం ద్వారా..కొత్త వ్యూహం అమలు చేస్తున్నట్లు భావిస్తున్నారు.

నిజంగా వెళ్తారా- వ్యూహంలో భాగమా..
దీని ద్వారా అధికారులను అప్రమత్తం చేయటం..అదే సమయంలో ప్రతిపక్షాలకు రాజకీయంగా సమాధానం చెప్పటం కోసమే అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఈ సమావేశానికి తెలంగాణ ముఖ్యమంత్రి హజరు ఖాయమైతే సహజంగా నే ఏపీ సీఎం పైనా ఒత్తిడి పెరుగుతోంది. ఏపీలోని ప్రతిపక్షాలు సైతం సీఎంను ఈ సమావేశానికి హాజరు కావాలని డిమాండ్ చేసే అవకాశాలు ఉన్నాయి. అయితే, కేసీఆర్ ఈ సమావేశానికి హాజరయ్యే అవకాశాలు చాలా తక్కువని..కేవలం అధికారులతోనే చర్చలు ఉంటాయని మరి కొందరు చెబుతున్నారు. కొద్ది రోజుల క్రితం కేంద్ర జలశక్తి మంత్రి సైతం త్వరలోనే రెండు రాష్ట్రాల నీటి వివాదాల మీద పరిష్కారం దిశగా చర్చలు చేపడతామని చెప్పుకొచ్చారు.

అధికారులకు దిశా నిర్దేశం
ఇప్పటికే కేసీఆర్ ఈ సమావేశం గురించి ఇరిగేషన్ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. బోర్డు సమావేశంలో తెలంగాణ తరఫున అనుసరించాల్సిన వ్యూహంపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. నీటి వాటా కోసం కేఆర్‌ఎంబీ, ట్రైబ్యునళ్లు సహా అన్నిరకాల వేదికలపైనా బలమైన వాదనలు వినిపించాలని సీఎం పునురుద్ఘాటించారు. సాధికారిక సమాచారంతో సమావేశానికి హాజరు కావాలని సూచించారు. ఏపీ ప్రభుత్వం తాజాగా నీటి పంపకాల విషయంలో 50: 50 కాకుండా, 70 : 30 నిష్పత్తిలో పంపకాలు చేపట్టాలంటూ కేఆర్‌ఎంబీకి లేఖ రాసింది. దీని పైన కేసీఆర్ నిర్వహించిన సమీక్షలో చర్చ జరిగింది.

సీఎం జగన్ వ్యూహం ఏంటి..
కేఆర్‌ఎంబీ తదుపరి సమావేశంలో 50 శాతం కోటా కోసం వాదనలు వినిపించాలని ముఖ్యమంత్రి నిర్దేశించారు.చిన్న నీటి వనరుల విభాగంలో తెలంగాణ సర్కారు 89.15 టీఎంసీల వినియోగానికే పరిమితమైతే అప్పుడు ఏపీ, తెలంగాణలకు 70:30 నిష్పత్తిలో కృష్ణా జలాలను పంపిణీ చేయాలని స్పష్టం చేసింది. 2020 అక్టోబర్ 6న జరిగిన అపెక్స్ కౌన్సిల్ రెండో సమావేశంలో బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్(కేడబ్ల్యూడీటీ-2) తీర్పు నోటిఫై అయ్యే వరకూ బచావత్ ట్రిబ్యునల్ (కేడబ్ల్యూడీటీ-1) తీర్పే అమల్లో ఉంటుందని కేంద్ర జల్ శక్తి శాఖ స్పష్టం చేయడాన్ని ఎత్తిచూపిందని తెలిపింది.
దీంతో..ఇప్పుడు సీఎం కేసీఆర్ సెప్టెంబర్ 1న జరిగే సమావేశానికి హాజరవుతారా లేక అధికారులు పాల్గొంటారా అనేది ఆసక్తి కరంగా మారుతోంది. కేసీఆర్ రాక ఖాయమైతే.. మరి, ఏపీ సీఎం ఏం చేస్తారనేది వేచి చూడాల్సిందే.












Click it and Unblock the Notifications