2024లో ఏర్పడే ప్రభుత్వం మనదే: ఎవరో చెబితే కాదంటూ కేసీఆర్ కీలక వ్యాఖ్యలు
హైదరాబాద్: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విశ్వమానవుడని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్(KCR) వ్యాఖ్యానించారు. హైదరాబాద్ నడిబొడ్డున హుస్సేన్ సాగర్ తీరన ఏర్పాటు చేసిన 125 అడుగుల బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆయన మనవడు ప్రకాశ్ అంబేద్కర్‌తో కలిసి సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన సభలో కేసీఆర్ మాట్లాడారు.
అంబేద్కర్ రాజ్యాంగం అమల్లోకి వచ్చి 70 ఏళ్ల దాటింది. ఏటా అంబేద్కర్ జయంతిని నిర్వహిస్తున్నాం. కానీ, దళితులు మాత్రం అభివృద్ధి చెందలేదు. అంబేద్కర్ కలలు సాకారం కావాల్సిన అవసరం ఉందని సీఎం కేసీఆర్ అన్నారు. అంబేద్కర్ సిద్ధాంతం విశ్వజనీనం, సార్వజనీనం అని ఆఆయన వ్యాఖ్యానించారు. ఎవరో అడిగితే హైదరాబాద్ నడిబొడ్డున అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయలేదన్నారు. అంబేద్కర్ విగ్రహం సమీపంలోని బుద్ధుడి విగ్రహం, అమరవీరుల స్మారకం ఉన్నాయన్నారు.

తెలంగాణ సచివాలయానికి కూడా అంబేద్కర్ పేరు పెట్టుకున్నామని కేసీఆర్ చెప్పారు. ఇది విగ్రహం కాదు.. విప్లమని చెప్పారు. అంబేద్కర్ పేరిట ఏటా అవార్డు ఇవ్వాలని కత్తి పద్మారావు సూచించారని తెలిపిన కేసీఆర్.. అవార్డు కోసం ప్రత్యేకంగా రూ. 51 కోట్లతో నిధి ఏర్పాటు చేస్తామన్నారు. దీనిపై ఏటా రూ. 3 కోట్ల వరకు వడ్డీ వస్తుందన్నారు. ఏటా అంబేద్కర్ జయంతి రోజున ఉత్తమ సేవలందించిన వారికి ప్రభుత్వం తరపున అవార్డు ప్రధానం చేస్తామని కేసీఆర్ వివరించారు. తెలంగాణ కలలను సాకారం చేసుకునే చిహ్నం ఈ విగ్రహమన్నారు. విగ్రహ ఏర్పాటు కృషి చేసిన వారందరికీ ఈ సందర్భంగా కేసీఆర్ ధన్యవాదాలు తెలిపారు.

ప్రజలు గెలిచే రాజకీయం రావాలని కేసీఆర్ అన్నారు. 2024 ఎన్నికల్లో రాబోయే ప్రభుత్వం తమదేనని ధీమా వ్యక్తం చేశారు. దేశమంతా ఏటీ 25 లక్షల కుటుంబాలకు దళితబంధు ఇచ్చే రోజు వస్తుందని సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వ్యాఖ్యానించారు. మహారాష్ట్రలో బీఆర్ఎస్ కు మంచి స్పందన వచ్చిందని.. యూపీ, బీహార్ రాష్ట్రాల్లో కూడా వస్తుందన్నారు. దేశమంతా స్పందిస్తుందన్నారు. ఈ మాటలు కొందరికి మింగుడు పడకపోవచ్చన్నారు. తెలంగాణలో ఇప్పటి వరకు 50వేల మందికి దళితబంధు అందిందని.. ఈ సంవత్సరం మరో 1.25 లక్షల మందికి అమలు చేస్తామని కేసీఆర్ చెప్పారు.












Click it and Unblock the Notifications