కెసిఆర్ ఫ్యాక్టర్: ప్రత్యేక హోదాపై పోరుకు చంద్రబాబు వెనకంజ?
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా ఇచ్చేదిలేదని కేంద్ర ప్రభుత్వం తేల్చిచెప్పిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఎందుకు గట్టిగా మాట్లాడకపోవడం వెనక తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు అంశం ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. శనివారం నిర్వహించిన తెలుగుదేశం పార్టీ విస్తృత స్ధాయి సమావేశంలో మాట్లాడుతూ ఏపీని అన్ని రాష్ట్రాలతో సమానంగా చూడకూడదని, ఏపీ పరిస్ధితిని వేరని అన్నారు.
ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వకపోతే చంద్రబాబు బీజేపీతో నిజంగానే తెగతెంపులు చేసుకుంటారా? అనే దానిపై కూడా స్పష్టంగా ఎక్కడా మాట్లాడటం లేదు. అయితే ఇటీవల కాలంలో తెలుగు రాష్ట్రాల్లో జరిగిన పరిణామాల దృష్ట్యా సీఎం చంద్రబాబు అంత సాహసం చేయకపోవచ్చుననే మాట వినిపిస్తోంది.
అసలే ఓటుకు నోటు కేసుతో సతమతమవుతున్న ఏపీ సీఎం చంద్రబాబుకి కొత్తగా ఈ ప్రత్యేకహోదా మరో తలనొప్పి తెచ్చి పెట్టింది. అటు కేంద్రంలోనూ, ఇటు రాష్ట్రంలోనూ టీడీపీ, బీజేపీలు భాగస్వామ్య పక్షాలుగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబు తీసుకున్న ఎలాంటి నిర్ణమైనా ఏపీపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది.

ప్రత్యేక హోదాపై తమ పార్టీ పోరాటానికి దిగితే బిజెపి తమతో తెగదెంపులు చేసుకోవడానికైనా సిద్ధపడుతుందనే ఉద్దేశంతో చంద్రబాబు ఉన్నట్లు చెబుతున్నారు. తాను దూరమైతే బిజెపి కెసిఆర్‌ను చేరదీస్తుందని, దానివల్ల ఎపికి కేంద్రం పూర్తి స్థాయిలో సహాయ నిరాకరణకు దిగుతుందనే భయం చంద్రబాబుకు ఉందని చెబుతున్నారు. దానివల్ల రెంటికి చెడిన రేవడి అవుతుందని, ఇప్పటికే కష్టాల్లో ఉన్న ఎపి మరింత కష్టాల్లో కూరుకుపోతుందని ఆయన అనుకుంటున్నట్లు తెలుస్తోంది.
టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి శనివారం మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఏపీకీ ప్రత్యేక హోదా ఇవ్వదనే విషయం చంద్రబాబుకూ తెలుసంటూ మరో బాంబు పేల్చారు. ఈ స్థితిలో ఏపీకి ప్రత్యేకహోదా అంశాన్ని తెలంగాణ సీఎం కేసీఆర్ అనుకూలంగా మలచుకునే అవకాశాలు లేకపోలేదనే మాట వినిపిస్తోంది.
సీఎం కేసీఆర్ కూడా కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామ్యమయ్యేందుకు గత కొంతకాలంగా ఎదురు చూస్తున్నారనే ప్రచారం సాగుతోంది. ఇటీవల కాలంలో కేసీఆర్ కుమార్తె, నిజామాబాద్ ఎంపీ కవితకి కేంద్ర కేబినెట్‌లో మంత్రి పదవి లభించనుందంటూ మీడియాలో వార్తలు కూడా వచ్చాయి.
అసలు ప్రత్యేక హోదా అంశంపై ఏపీ సీఎం చంద్రబాబు ఎందుకు కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయడం లేదు. పార్లమెంట్‌లో ఎంపీలు కూడా ఏపీ ప్రత్యేకహోదా అంశంపై ఎందుకు మాట్లాడటం లేదు. ఇక ఏపీకి ప్రత్యేకహోదా అందని ద్రాక్షగానే మిగులుతుందా? అనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. ఇంతటి తీవ్రమైన ప్రశ్నలు ఉదయిస్తున్న తరుణంలో కూడా చంద్రబాబు కర్ర విరగకుండా పాము చావకుండా వ్యవహరిస్తుండడం వ్యూహాత్మకమేనని అంటున్నారు. బిజెపితో తెగదెంపులు చేసుకోవడం ఇష్టం లేకనే ఆయన అలా వ్యవహరిస్తున్నారని తెలుస్తోంది.
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలంటే పార్లమెంట్‌లో 15 రాష్ట్రాలు అంగీకరిస్తే సరిపోతుంది. ప్రస్తుతం మనదేశంలో మోడీ నేతృత్వంలోని ఎన్టీఏలో భాగస్వామ్యమైన పార్టీలకు చెందిన ప్రభుత్వాలే 12 రాష్ట్రాల్లో ఉన్నాయి. ఇక నరేంద్రమోడీ కేవలం 3 రాష్ట్రాలను ఒప్పిస్తే ఏపీకి ప్రత్యేకహోదా లభిస్తుంది.
అయితే ప్రధాని నరేంద్రమోడీ ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేందుకు మూడు రాష్ట్రాలను ఒప్పించలేక పోతున్నారా? ఆయన తలచుకుంటే ఇదేమి పెద్ద కష్టం కాదు. కానీ బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు ఏపీకి ప్రత్యేకహోదా ఇస్తే తాను ఇచ్చిన కీర్తి దక్కదు కాబట్టి వెనక్కి వెళ్తున్నట్లు భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications