గవర్నర్‌ను కెసిఆర్ అందుకే కలిశారా?: తెలంగాణలో 'పోలీసు రాజ్యం'!
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు బుధవారం నాడు గవర్నర్ నరసింహన్‌ను కలిశారు. అయితే, ప్రతిపక్షాల పైన ఫిర్యాదు చేసేందుకు ఆయన కలిశారని బిజెపి శాసన సభా పక్ష నేత కిషన్ రెడ్డి ఆరోపించారు.
మరోవైపు, బిజెపి నేత, బచావో తెలంగాణ చీఫ్ నాగం జనార్ధన్ రెడ్డి గురువారం గవర్నర్ నరసింహన్‌ను కలిశారు. రైతాంగ సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఫిర్యాదు చేశారు. దసరాలోపు రైతు సమస్యలు పరిష్కరించకుంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామన్నారు. కెసిఆర్ హఠావో, కిసాన్ బచావో అని నినదించారు.

బిజెపి ఎమ్మెల్సీ చింతల రామచంద్రా రెడ్డి వేరుగా మాట్లాడుతూ... కెసిఆర్ అవగాహన లేమితో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. 10న విపక్షాల బందుకు అందరూ సహకరించాలన్నారు. విపక్షాల సలహాలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. రైతు ఆత్మహత్యల నేపథ్యంలో విపక్షాలను కేంద్రం వద్దకు తీసుకెళ్లాలన్నారు. కెసిఆర్ ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చారని మండిపడ్డారు.

రైతు ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలేనని తెలంగాణ టిడిపి అధ్యక్షులు ఎల్ రమణ అన్నారు. గత ప్రభుత్వాల పైన నెపం వేయడం కెసిఆర్ అసమర్థతకు నిదర్శనం అన్నారు. ఏకకాలంలో రైతు రుణాలు మాఫీ చేయాలన్నారు. ప్రయివేటు అప్పుల పైన మారటోరియం విధించాలన్నారు.
కెసిఆర్ పాలనలో పోలీసుల రాజ్యమైందని తమ్మినేని వీరభద్రం అన్నారు. తెలంగాణ సమాజం అన్యాయాన్ని సహించదన్నారు. అడ్డగోలుగా వ్యవహరిస్తే తిరుగుబాటు తప్పదన్నారు.

ప్రభుత్వం విఫలం: శ్రీధర్ బాబు
శాసన సభ నిర్వహణలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత శ్రీధర్ బాబు అన్నారు. 10వ తేదీన అఖిల పక్ష బందుకు అందరూ సహకరించాలన్నారు. 10వ తేదీ వరకు శాసన సభ నిర్వహిస్తామని అర్ధాంతరంగా ముగించిందన్నారు. రైతు ఆత్మహత్యల నివారణకు చర్యలు తీసుకోకుండా గత ప్రభుత్వాల పైకి నెట్టడం సరికాదన్నారు.












Click it and Unblock the Notifications