మహిళా బిల్లు కోసం పోరాటం ఆగదు: ఢిల్లీలో కవిత స్పష్టం, దీక్ష విరమణ
మహిళా రిజర్వేషన్ బిల్లు పార్లమెంటులో ప్రవేశపెట్టి ఆమోదం కోసం దేశ రాజధానిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేసిన నిరాహార దీక్ష ముగిసింది.
న్యూఢిల్లీ: మహిళా రిజర్వేషన్ బిల్లు పార్లమెంటులో ప్రవేశపెట్టి ఆమోదం కోసం దేశ రాజధానిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేసిన నిరాహార దీక్ష ముగిసింది. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద శుక్రవారం ఉదయం 10 గంటలకు ప్రారంభమైన కవిత తను దీక్షను సాయంత్రం 4 గంటలకు విరమించారు. ఈ దీక్షను కవితచే సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ప్రారంభించగా.. సాయంత్రం 4 గంటలకు బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు ఆమెకు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు.

మహిళా రిజర్వేషన్ సాధించేవరకు విశ్రమించేది లేదన్న కవిత
దీక్ష అనంతరం కవిత మాట్లాడుతూ.. తన పోరాటం ఒక్క కవిత కోసమో.. ఒక్క రాష్ట్రం కోసమో కాదన్నారు. మహిళా రిజర్వేషన్ల బిల్లు కోసం తమ పోరాటం కొనసాగుతుందన్నారు. మహిళ రిజర్వేషన్ సాధించేవరకు విశ్రమించేది లేదని స్పష్టం చేశారు. మోడీ సర్కారు తలచుకుంటే ఈ బిల్లు పాసవుతుందన్నారు. మహిళా బిల్లు చారిత్రక అవసరమని, పోరాటం గదని చెప్పారు.

పోరాటం ఉధృతం చేస్తామన్న కవిత
వచ్చే పార్లమెంటు సమావేశాల్లో బిల్లు పాసయ్యేలా.. అందరం కలిసి ఒత్తిడి తేవాలని పిలుపునిచ్చారు కవిత. డిసెంబర్ లో పార్లమెంట్ సమావేశాలు ముగిసేవరకు పోరాడుతూనే ఉంటామన్నారు. బిల్లు ఆమోదం పొందేవరకూ ఒత్తిడి తెస్తామన్నారు. రాష్ట్రపతికి కూడా దీనిపై విజ్ఞప్తి చేస్తున్నట్లు తెలిపారు. ఇవాళ ప్రారంభించిన పోరాటం ఇంకా ఉధృతమవుతుందన్నారు. మహిళా బిల్లు సాధించి తీరాలని కవిత స్పష్టం చేశారు.
పార్టీలు, నేతలకు కవిత ప్రత్యేక ధన్యవాదాలు
మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం చేపట్టిన దీక్షకు మద్దతు ఇచ్చిన పార్టీలకు, నేతలకు ఎమ్మెల్సీ కవిత ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. దీక్షకు మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పారు. ఢిల్లీ మహిళా నేతలకు, విద్యార్థి నేతలకు ధన్యావాదాలు తెలిపారు. ఈ దీక్షకు మొత్తం 18 పార్టీలు సంఘీభావం ప్రకటించిన విషయం తెలిసిందే. కవిత దీక్షలో ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు సంజయ్ సింగ్, చిత్ర సర్వార, నరేష్ గుజ్రాల్ (అకాలీదళ్) శివసేన ప్రతినిధులు, అంజుమ్ జావేద్ మిర్జా (పీడీపీ), షమీ ఫిర్దౌజ్ (నేషనల్ కాన్ఫరెన్స్), సుస్మితా దేవ్ (టీఎంసీ), కేసీ త్యాగి (జేడీయూ), సీమా మాలిక్ (ఎన్‌సీపీ), సీతారాం ఏచూరి (సీపీఎం), కే.నారాయణ (సీపీఐ), పూజ శుక్లా (ఎస్‌పీ), శ్యామ్ రాజక్ (ఆర్ఎల్‌డీ), కపిల్ సిబల్, ప్రశాంత్ భూషణ్ సహా పలు విపక్ష పార్టీల నేతలు, ప్రతినిధులు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications