కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి మంత్రి పదవి ఇస్తానన్నా తీసుకోను.!తనది చాలా వెరైటీ అంటున్న జగ్గారెడ్డి.!
సంగారెడ్డి/హైదరాబాద్ : టిపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. హైదరాబాద్ మీడియాతో చనువుగా ఉంటూ అనేక అంశాలను వివరిస్తూ రెబల్ గా కనిపించే జగ్గారెడ్డి గత వారం రోజులు నిశ్శబ్దం తర్వాత మళ్లీ ఆటమ్ బాంబ్ లాంటి వ్యాఖ్యలు చేసారు. ఎప్పుడూ అధికార పార్టీని విమర్శిస్తే కిక్కేముందనుకుంటారో ఏమో గాని, జగ్గారెడ్డి సొంత పార్టీ నేతలను కూడా అంతే స్థాయిలో విమర్శిస్తూ సమన్యాయం చేసేందుకు తహతహలాడుతుంటారు.

గెలుపోటములు సమానం.. జగ్గారెడ్డి విచిత్ర విశ్లేషణ..
తాజాగా సంగారెండ్డిలో జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలు పార్టీలో ఎండాకాలం ఎండ కన్నా సెగలు కక్కిస్తున్నాయి. తనకు మంత్రి కావాలని లేదని సంగారెడ్డిలో పాస్టర్స్ కాన్ఫరెన్స్ కార్యక్రమంలో జగ్గారెడ్డి స్పష్టం చేసారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి పదవి ఇస్తానన్నా తాను తీసుకోనన్నారు జగ్గారెడ్డి. తాను గెలుపు.. ఓటమిని ఒకేలా చూస్తానని జగ్గారెడ్డి తేల్చి చెప్పారు. జగ్గారెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి.

కొన్ని సందర్బాల్లో గెలుపుకన్నా ఓటమే సుఖం.. జగ్గారెడ్డి వింత ప్రకటన..
కొన్నిసార్లు ఓటమి కూడా మేలు అనిపిస్తుందని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. తనది డిఫరెంట్ మైండ్, డిఫరెంట్ క్యారెక్టర్ అని తనకు తాను కితాబిచ్చుకున్నారు జగ్గారెడ్డి. తాను ముగ్గురు సీఎంలు రాజశేఖర్ రెడ్డి, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో పరిపాలనా విధానంలో, రాజకీయ వ్యూహాల్లో భాగస్వామ్యం ఉందని, అందుకనే తనకు పదవుల మీద పెద్ద ఆసక్తి లేదన్నారు. తాను గెలుపుని, ఓటమిని ఒకేలా చూస్తానన్నారు.

అధికారంలో ఉంటే అంతా శూన్యమే.. ఏమీ తెలియదన్న జగ్గారెడ్డి
అధికారం ఉన్నపుడు అన్నీ తెలుస్తాయని అనుకుంటామని, కానీ అధికారంలో ఉంటే కొన్నే తెలుస్తాయన్నారు. కొన్నిసార్లు అధికారం లేకపోతే ఇంకా చాలా విషయాలు తెలుస్తాయని ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. ఎన్నికలలో గెలుపు, ఓటములు సహజమన్నారు. గెలుపు ప్రజాసేవకు ఉపయోగపడుతుందని, ఓటమి అనుభవానికి ఉపయోగపడుతుందని అయన వేదాంతం పలికారు. ఈ రెండూ ప్రతీ నాయకుడికి అవసరమని జగ్గారెడ్డి వివరించారు.
Recommended Video


పదవుల మీద పెద్దగా ఆసక్తి లేదు.. సంచలన వ్యాఖ్యలు చేసిన జగ్గన్న
అధికారం ఉన్నా లేకున్నా ఒకటేనని, పార్టీ గెలిచినా, గెలవక పోయినా ఒకటేనని జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యల పట్ల కాంగ్రెస్ నాయకులు ఏ విధంగా స్పందింస్తారన్నది ఆసక్తికరంగా మారింది. పార్టీ గెలిచి మంత్రి పదవి ఇస్తానంటే తీసుకోనని ప్రకటించిన జగ్గారెడ్డి వ్యాఖ్యలను కూడా అధిష్టానం ఎలా తీసుకుంటుందన్నది ఉత్కంఠగా మారింది. పార్టీ లోని బూత్ స్థాయి నాయకుడి దగ్గర నుండి జాతీయ స్థాయి నేత వరకూ రాజకీయంగా పోరాడేది గెలుపుకోసమే. అలాంటి గెలుపును చాలా తృణప్రాయంగా అభివర్ణించిన జగ్గారెడ్డి మానసిక స్థితిని కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అంచనా వేస్తుందో చూడాలి.












Click it and Unblock the Notifications