తాగుడికి డబ్బులు ఇవ్వలేదని భర్తను చంపేసి...
హైదరాబాద్ : తాగుడుకు బానిసైన ఓ వృద్ధురాలు మద్యానికి డబ్బులు ఇవ్వడం లేదని భర్తను మట్టుబెట్టింది. హైదరాబాదులోని ఉస్మానియా విశ్వవిద్యాలయం పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఘటన వివరాలను ఇన్‌స్పెక్టర్ అశోక్‌రెడ్డి వెల్లడించారు.
మాణికేశ్వరీనగర్‌లో నివాసం ఉండే చద్రయ్య(52), రాములమ్మ(50)భార్యాభర్తలు. వీరికి కొడుకు, నలుగురు కూతుళ్లు ఉన్నారు. చంద్రయ్య,రాములమ్మ మాణికేశ్వరీనగర్‌లో కొడుకు, కోడలుతో కలిసి ఉంటున్నారు.
జీవనోపాధి కోసం చంద్రయ్య కూలీ పనులు చేస్తున్నాడు. రాములమ్మ కొంతకాలంగా మద్యానికి బానిసైంది. చంద్రయ్యను నిత్యం డబ్బులు అడిగి తీసుకునేది. ఇవ్వకపోతే గొడవకు దిగేది. ఆమెతో విసిగిపోయిన చంద్రయ్య కూలీకి వెళ్లడం మానేశాడు. అయితే ఈనెల 21వ తేదీన తాగడానికి డబ్బులు ఇవ్వంటూ చంద్రయ్యతో గొడవ పడింది. సాయంత్రం వరకూ ఘర్షణ కొనసాగింది.

అయితే రాత్రి భోజనం చేసి పడుకున్న కాసేపటి తర్వాత రాములమ్మ "మీ నాన్న చనిపోయాడ"ని కొడుకుకి చెప్పింది. దీంతో కంగారుపడిన కొడుకు ఇంట్లోకి వెళ్లి చూడగా, చంద్రయ్య చనిపోయి ఉన్నాడు. ఈనెల 22న ఉదయం అందరూ చంద్రయ్య మృతదేహాన్ని పరిశీలించగా గొంతును నులిమినట్లు గాట్లు ఉన్నాయి.
దీంతో అనుమానం వచ్చి తల్లిని ప్రశ్నించగా ఎలాంటి సమాధానం రాలేదు. దీంతో పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు రాములమ్మను అదుపులోకి తీసుకొని విచారించగా తాగడానికి డబ్బులు ఇవ్వనందుకే చంపినట్లు అంగీకరించింది. దీంతో కేసు నమోదు చేసి ఆమెను రిమాండ్‌కు తరలించారు.












Click it and Unblock the Notifications