గంజాయి డబ్బు కోసం అమ్మాయి తాకట్టు, వేధింపులు
హైదరాబాద్: గంజాయి వ్యాపారాన్ని నిర్వహించడం చట్ట విరుద్ధం. అలాంటిది గంజాయి తీసుకొస్తామని చెప్పి, కూతురు వరసయ్యే అమ్మాయిని తాకట్టు పెట్టిన సంఘటన వరంగల్ జిల్లా నెల్లికుదురు మండలం బోడుమీది తండాలో సోమవారం సాయంత్రం వెలుగు చూసింది.
ఈ సంఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. బోడుమీదితండాకు చెందిన దల్‌సింగ్, బావ్‌సింగ్ గంజాయి వ్యాపారం చేస్తుంటారు. వీరికి విశాఖ జిల్లా గూడెంకు చెందిన పాండయ్యతో గత కొంత కాలంగా స్నేహం ఏర్పడింది. ఆండయ్య విశాఖలో గంజాయి వ్యాపారం చేస్తూ ఉండేవాడు.
ఈ క్రమంలో సుమారు 20 రోజుల క్రితం తనకు కూతురు వరుసయ్యే కాసులమ్మ అనే మహిళను తీసుకొని ఆండయ్య బోడుమీది తండాకు వచ్చాడు. తన వద్ద గూడెంలో గంజాయి ఉందని, రూ. 35 వేలు ఇస్తే ఆ గంజాయిని ఇస్తానన్నాడు. రూ.38 వేలు ఇవ్వడానికి అంగీకరించిన దల్‌సింగ్, బావ్‌సింగ్ డబ్బు తీసుకొని మీరు పారిపోతే తమకు నమ్మకం ఏమిటంటూ ప్రశ్నించాడు.

దీంతో వరుసకు కూతురయ్యే కాసులమ్మను రూ. 38 వేలకు తాకట్టుగా ఉంచుతానని, గంజాయి ఇచ్చాక తన కూతురును తీసుకొని వెళ్తానని చెప్పాడు. దీంతో కాసులమ్మను తమ వద్ద ఉంచుకొని రూ. 35 వేలను పాండయ్యకు దల్‌సింగ్, బాల్‌సింగ్ ఇచ్చారు.
డబ్బులు తీసుకొని వెళ్లిన పాండయ్య ఎంతకీ రాకపోవడంతో కాసులమ్మను నిర్బంధించారు. శారీరకంగా, మానసికంగా వేధించడం ప్రారంభించారు. దల్‌సింగ్, బావ్‌సింగ్‌ల వేధింపులను తట్టుకోలేని కాసులమ్మ ఎలాగోలా కాసులమ్మ తాను వరంగల్ జిల్లా నెల్లికుదురు మండలం బోటిమీది తండాలో ఉన్నట్లు తన బంధువులకు సమాచారం ఇచ్చింది.
దీంతో కాసులమ్మ బంధువులు తెలంగాణ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడైన మహబూబాబాద్ వాసి సోమారపు వీరస్వామి సహకారంతో పోలీసులను ఆశ్రయించారు. మహబూబాబాద్ టౌన్ సిఐ నంది రాం నాయక్ బోటిమీది తండాకు వెళ్లి ఆరా తీశారు. కాసులమ్మ బావ్‌సింగ్, దల్‌సింగ్‌ల ఇంటి వద్ద ఉండడంతో ఆమెను విడిపించి కేసు మోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications