ప్రజాభవన్ వద్ద మంత్రి సీతక్క కారును అడ్డగించి వ్యక్తి హల్చల్
హైదరాబాద్: ప్రజా భవన్ వద్ద ఓ యువకుడు వీరంగం సృష్టించాడు. తన సమస్యను పరిష్కరించాలని ప్రజాభవన్ నుంచి అటుగా వెళ్తున్న తెలంగాణ మహిళా శిశు, సంక్షేమ శాఖ మంత్రి సీతక్క (Seethakka) కారును ఆపి హంగామా చేశాడు. మల్లాపూర్‌కు చెందిన యోహాన్ సిరిమల్ల అనే ఈ యువకుడు తనకు న్యాయం చేయాలంటూ కోరాడు.
తనకు పోలీసులు అన్యాయం చేశారని, తన బాధను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy)తో నేరుగా చెప్పడానికి అవకాశం ఇవ్వాలని అతడు కోరాడు. తన బాధకు కారణం న్యాయం జరగదనే కారణంతో ప్రజాభవన్ దగ్గర నిరసన వ్యక్తం చేస్తున్నట్లు తెలిపాడు.

తాను న్యాయం కోసం పోరాడుతుంటే.. పోలీసుల నుంచి ప్రాణహాని ఉందని యోహాన్ మంత్రి సీతక్కతో ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ కారు ఆపిన మంత్రి సీతక్క.. పోలీసులు అతని ఫిర్యాదును స్వీకరించి, న్యాయం జరిగేలా చూడాలని ఆదేశించారు. కాగా, నేడు మంగళవారం కావడంతో ప్రజాభవన్ అర్జిదారులు భారీగా తరలివచ్చారు.
చేవెళ్ల సభలో బీఆర్ఎస్‌పై విరుచుకుపడ్డ సీతక్క
రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన జన జాతర బహిరంగ సభలో మంత్రి సీతక్క మాట్లాడుతూ.. బీఆర్ఎస్ నేతలపై విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ ఇచ్చే హామీలకు వారంటీ లేదన్నవాళ్లు.. అడ్రస్ లేకుండా పోయారని విమర్శించారు. అధికారంలోకి వచ్చిన రెండు రోజుల్లోనే రెండు గ్యారంటీలను అమలు చేశామని.. ఇవాళ మరో రెండు గ్యారంటీలకు శ్రీకారం చుట్టామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీపై తప్పుడు కూతలు కూసినవాళ్లు అడ్రస్ లేకుండా పోయారన్నారు. హామీలు అమలు చేస్తుంటే బీఆర్ఎస్ నేతలు ఓర్వలేకపోతున్నారని సీతక్క మండిపడ్డారు.
కాంగ్రెస్ పార్టీ రాష్ట్రపతి పదవి మొదలుకుని మహిళలకు ఎన్నో కీలక పదవులు ఇచ్చిందన్నారు మంత్రి సీతక్క. స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్లు అమలు చేసింది కాంగ్రెస్ పార్టీ. గత ప్రభుత్వం మహిళల అభయ హస్తం డబ్బులను కూడా వాడుకున్నది. గతంలో కాంగ్రెస్ పార్టీ రూ.105కే 9 సరుకులు ఇచ్చింది. ఇప్పుడు కూడా పేదలపై ధరల భారం పడొద్దని రూ.500కే గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాం. పేదల ఇళ్లకు వెలుగులు పంచేలా రూ.200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తున్నామని మంత్రి సీతక్క తెలిపారు.












Click it and Unblock the Notifications