అమీర్ పేట్ OYO రూమ్ లో మహిళ దారుణ హత్య.. దర్యాప్తులో సంచలన విషయాలు..!
హైదరాబాద్ లోని అమీర్ పేట్ లో దారుణమైన ఘటన జరిగింది. గోకుల్ ప్రైడ్ హోటల్ గదిలో మహిళ దారుణ హత్యకు గురైంది. హోటల్ లోని రూమ్ నెం. 103 లో ఈ దారుణం జరిగింది. హోటల్ సిబ్బంది సమాచారం ఇవ్వడంతో రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆధార్ కార్డులో మహిళ పేరు దుర్గగా గుర్తించారు. అయితే ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ట్రీట్ మెంట్ తీసుకున్నప్పుడు మృతురాలి పేరు శిరీష అని ఉందని పోలీసులు గుర్తించారు. పోలీసుల సమాచారం ప్రకారం.. ఒక ప్రైవేట్ బ్యాంకులో పనిచేస్తున్న శిరీష అలియాస్ దుర్గ హోటల్ గదిలో అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. ఈ నెల 25న ఆమె హోటల్ కు వచ్చినట్లు తెలుస్తోంది. సీ గణేష్ అనే పేరుతో హోటల్లో రూమ్ బుక్ చెయ్యగా.. గణేష్ అనే వ్యక్తి ఘటన అనంతరం అర్ధరాత్రి సుమారు 3 గంటల సమయంలో హోటల్ నుంచి పరారైనట్లు సమాచారం.
శిరీష పనిచేస్తున్న ప్రైవేట్ బ్యాంక్ కు కస్టమర్ గా వచ్చిన గణేష్ తో ఆమెకు పరిచయం ఏర్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. గతంలోనూ ఇద్దరూ అప్పుడప్పుడు హోటల్ కు వచ్చి వెళ్లేవారని స్థానికులు చెబుతున్నారు. అయితే గణేష్ తో తమ సోదరికి పరిచయం ఉన్న విషయం తమకు తెలియదని శిరీష కుటుంబ సభ్యులు వెల్లడించారు.
ఇక 2013లో వివాహమైన శిరీష అనంతరం విడాకులు తీసుకుని గత ఏడేళ్లుగా ఒంటరిగా జీవిస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. తమ కుమార్తెను హత్య చేసిన వ్యక్తిని వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని వారు పోలీసులను కోరారు. మరోవైపు గోకుల్ ప్రైడ్ హోటల్ లో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయంటూ స్థానికులు ఆరోపిస్తున్నారు. హోటల్ పరిసరాల్లో కండోమ్ ప్యాకెట్లు కనిపిస్తున్నాయని వారు పేర్కొన్నారు. అయితే ఇదే విషయం ఏసీపీ రాఘవేందర్ రావు మీడియాతో మాట్లాడుతున్న సమయంలో మీడియా ప్రతినిధులు ఏసీపీకి అక్కడే ఉన్న కొన్ని కండోమ్ ప్యాకెట్లను చూపించగా విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.

ఇక హత్య జరిగిన హోటల్ గదిని డీసీపీ రమణారెడ్డి పరిశీలించారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నామని తెలిపారు. మరోవైపు హోటళ్లలో నిబంధనల ఉల్లంఘనలపై తనిఖీలు ముమ్మరం చేయాలని స్థానికులు కోరుతున్నారు.












Click it and Unblock the Notifications
