అయ్యా.. దొర గారూ... కరోనాను ఆరోగ్య శ్రీలో చేర్చరాదు.. షర్మిల సెటైర్లు
కరోనా కోరలు చాచింది. దేశంలో వేగంగా వ్యాప్తి చెందుతోంది. తెలుగు రాష్ట్రాల్లో అయితే ఇక చెప్పక్కర్లేదు. కేసులు సంఖ్య ఆందోళన కలిగిస్తోంది. రికవరీ రేటు కూడా దాదాపు అదే స్థాయిలో ఉంటోంది. దీంతోపాటు మరణాలు కూడా ఫస్ట్ వేవ్ కంటే ఎక్కువగానే ఉంటున్నాయి. దీంతో భయాందోళన తప్పడం లేదు. కరోనా గురించి రాష్ట్ర ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకుంటున్నాయి. అయినప్పటికీ ఎక్కడో ఓ చోట ఆక్సిజన్ లేక.. వెంటిలేటర్లు అందుబాటులో లేకుండా ఇబ్బందులు తప్పడం లేదు.

కరోనా కల్లోలం..
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ బీభత్సంగా విస్తరిస్తోంది. అయితే రాష్ట్ర ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదని వైఎస్ షర్మిల మండిపడ్డారు. సీఎం కేసీఆర్‌పై ఆమె తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇంక ఎంతమంది ఆక్సిజన్ అందక చనిపోతే కరోనా కంట్రోల్ తప్పిందని భావిస్తారు అని ప్రశ్నించారు. ఆసుపత్రుల్లో బెడ్లు సరిపోక ఇంకెంత మంది రోడ్డున పడితే కరోనా విలయ తాండవం చేస్తోందని అనుకుంటారని నిలదీశారు. ఇంకెంత మంది వ్యాక్సిన్ అందక కోవిడ్ బారిన పడితే కరోనా ఉందని గుర్తిస్తారని ప్రశ్నించారు.

అదుపు తప్పలేదా.. దొర...
తెలంగాణ ప్రజలు ఇంకెంత మంది అప్పుల బారిన పడితే రాష్ట్రంలో కరోనా అదుపు తప్పిందని అనుకుంటారని షర్మిల నిలదీశారు. కరోనా కంట్రోల్ లో ఉందని జబ్బలు చరచుకోవడం మానుకోవాలని హితవు పలికారు. కళ్లకు ఉన్న గంతలు తీసి, కరోనాను కట్టడి చేయాలని షర్మిల డిమాండ్ చేశారు. తెలంగాణలో రాజకీయ పార్టీ పెడతానని ప్రకటించిన షర్మిల.. దూకుడుగా ముందుకెళ్తున్నారు. కేసీఆర్ లక్ష్యంగా విమర్శలు చేస్తున్నారు.

ఆరోగ్య శ్రీలో చేర్చండి మహా ప్రభో
కరోనా వైరస్‌ను ఆరోగ్యశ్రీలో చేర్చాలని షర్మిల అన్నారు. దొర ఇకనైనా ప్రజల గోడు ఆలకించాలని కోరారు. కరోనా కరాళ నృత్యం చేస్తుందని ఆమె వివరించారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితిని గుర్తించాలని హితవు పలికారు. ప్రజల ప్రాణాలు గాలిలో కలుస్తోన్న చోద్యం చూడటం సరికాదు అని అభిప్రాయపడ్డారు. ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విరుచుకుపడ్డారు. పరిస్థితి మరింత చేయి దాటకముందే మేల్కోవాలని కోరారు. మీ ప్రభుత్వ నిర్లక్ష్యం, నిర్లిప్తతను ప్రజలు గమనిస్తున్నారనే విషయం గుర్తుంచుకోవాలని సూచించారు.












Click it and Unblock the Notifications