ఢిల్లీకి వైఎస్ షర్మిల- అనూహ్య నిర్ణయం
వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. దేశ రాజధానిలో భారీ నిరసన ప్రదర్శనను నిర్వహించనున్నారు.
హైదరాబాద్: వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల.. దేశ రాజధానిపై దృష్టి సారించారు. మొన్నటి వరకు తెలంగాణలో విస్తృతంగా పాదయాత్ర నిర్వహించిన ఆమె.. ఢిల్లీ గడప తొక్కనున్నారు. ఢిల్లీలో భారీ ప్రదర్శనను నిర్వహించనున్నారు. జంతర్ మంతర్ నుంచి పార్లమెంట్ వరకు ఈ మహా ప్రదర్శన చేపట్టనున్నారు. దేశ రాజకీయాలను తన వైపు తిప్పుకొనే ప్రయత్నాలకు తెర తీసినట్టవుతుందామెకు.

కాళేశ్వరం..
దీనికి కారణం లేకపోలేదు. తెలంగాణలో అధికారంలో ఉన్న భారత్ రాష్ట్ర సమితి- ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న కాళేశ్వరం ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ లో పెద్ద ఎత్తున అవినీతి చోటు చేసుకుందంటూ మొదటి నుంచీ షర్మిల పోరాడుతూ వస్తోన్నారు. దీనిపై కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కు ఫిర్యాదు చేశారు. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ దృష్టికీ తీసుకెళ్లారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ను అతిపెద్ద కుంభకోణంగా ఆమె ఆరోపిస్తోన్నారు.

జంతర్ మంతర్ నుంచి..
ఈ అంశం మీద దేశ రాజధాని పోరాటం చేయడానికి సన్నద్ధం అయ్యారు వైఎస్ షర్మిల. మంగళవారం నిరసన ప్రదర్శన చేపట్టనున్నారు. జంతర్ మంతర్ నుంచి పార్లమెంట్ భవనం వరకు ఈ ప్రదర్శన కొనసాగుతుంది. దీనికి మద్దతు ఇవ్వాలంటూ ప్రతిపక్ష పార్టీలకు షర్మిల విజ్ఞప్తి చేశారు. కాళేశ్వరం అవినీతి విషయంలో తాను చేస్తోన్న పోరాటానికి కలిసి రావాలని సూచించారు. తెలంగాణలో బీఆర్ఎస్ యేతర పార్టీలు తనకు అండగా నిలుస్తాయని ఆశిస్తున్నట్లు చెప్పారు. ఈ నిరసన ప్రదర్శనకు సంఘీభావం తెలియజేయాలని కోరారు.

ప్రాణహిత-చేవెళ్ల
పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కాళేశ్వరం దేశంలోనే అతి పెద్ద స్కామ్ గా విమర్శించారు. ఈ ప్రాజెక్ట్ ఆయకట్టు కింద నీరు అందే ఎకరాల సంఖ్య, చేసిన ఖర్చు అన్నీ దొంగ లెక్కలేనంటూ ఆరోపించారు. గతంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 16.46 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వాలనే ఉద్దేశంతో 38,000 కోట్ల రూపాయలతో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారని గుర్తు చేశారు.

రూ.70,000 కోట్ల అవినీతి..
రాష్ట్ర విభజన అనంతరం అధికారంలోకి వచ్చిన కేసీఆర్ కమీషన్లకు కక్కుర్తిపడి రీ- డిజైన్ పేరుతో ప్రాజెక్టు వ్యయాన్ని మూడు రెట్లు పెంచారని విమర్శించారు. 18 లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తామని చెప్పి లక్షన్నర ఎకరాలకు కూడా నీళ్లు ఇవ్వలేదని అన్నారు. నాణ్యత లేని పనులు చేపట్టి మూడు సంవత్సరాలే కాళేశ్వరాన్ని ముంచారని ధ్వజమెత్తారు. మెగా కంపెనీతో కుమ్మక్కై దాదాపు 70 వేల కోట్ల అవినీతికి తెరలేపారని ఆరోపించారు.

సంఘీభావం తెలపాలి..
కాళేశ్వరం అవినీతిపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ ఇదివరకే తాము కాగ్, సీబీఐకి ఫిర్యాదు చేశామని వైఎస్ షర్మిల గుర్తు చేశారు. రేపు ఢిల్లీలోని జంతర్ మంతర్ నుంచి పార్లమెంట్ వరకు ర్యాలీ నిర్వహిస్తామని తెలిపారు. రెండో విడత పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నందున ఈ విషయాన్ని ఎంపీల దృష్టికి తీసుకుని రావాలనేదే తమ ఉద్దేశమని అన్నారు. కాళేశ్వరంలో అవినీతి జరిగిందని కేంద్రం చెప్పడం కాదని, విచారణ జరిపించి.. అది నిజం అని నిరూపించాలని డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications