నీ సంగతేంటో చెప్తా: బాబుపై ఊగిపోయిన మోత్కుపల్లి, ఇదే చెప్పారని విజయసాయి, నవ్వుకున్న చంద్రబాబు
అమరావతి/హైదరాబాద్: టీడీపీ బహిష్కృత నేత, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులుతో గురువారం వైసీపీ రాజ్యసభ సభ్యులు విజయ సాయి రెడ్డి భేటీ అయ్యారు. భవిష్యత్తు రాజకీయ పరిణామాలపై వీరిద్దరూ చర్చించారు. ఏపీలో మోత్కుపల్లి యాత్రకు తమ పార్టీ మద్దతు ఉంటుందని విజయసాయి చెప్పారు.
ఇటీవల మహానాడు సందర్భంగా మోత్కుపల్లిని పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్టు తెలంగాణ టీడీపీ అధ్యక్షులు ఎల్ రమణ ప్రకటించారు.
అయితే, తాను టీడీపీకి తన జీవితాన్ని అంకితం చేశానని నాడు కంటతడి పెట్టుకున్నారు మోత్కుపల్లి. బుధవారం (13-06-2018) ఆలేరులో మాట్లాడుతూ.. చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు. ఇప్పుడు విజయసాయి రెడ్డి భేటీ కావడం చర్చనీయాంశంగా మారింది. ఈ భేటీ అనంతరం మోత్కుపల్లి ఏపీ సీఎంపై నిప్పులు చెరిగారు.

నీ సంగతేమిటో నేను చెబుతా
కమ్మ కులంలో చెడపుట్టిన వ్యక్తి చంద్రబాబు అని మోత్కుపల్లి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కమ్మ కులానికి చెడ్డపేరు తెచ్చేటటువంటి వ్యక్తి చంద్రబాబునాయుడు గారు అన్నారు. ఒక్క విషయాన్ని గుర్తించాలని, ఏ పదవి అయినా నువ్వు (చంద్రబాబు) ఇస్తే తప్ప, నేను ఎన్నడైనా అడిగానా అని ప్రశ్నించారు. చంద్రబాబుకు దమ్ముంటే నేరుగా మాట్లాడాలన్నారు. మీడియా ద్వారా తన తప్పేంటో చెప్పాలని నిలదీశారు. నీ సంగతేమిటో నేను చెబుతానని హెచ్చరించారు.

దమ్ముంటే వారిలా సొంత జెండాతో పోటీ చెయ్
నువ్వొక బ్రోకర్‌వి, దందా కోరువి అని చంద్రబాబుపై మోత్కుపల్లి తీవ్ర పదజాలం ఉపయోగించారు. అల్లుడి వేషంలో ఎన్టీఆర్‌ని చంపి పార్టీ జెండా ఎత్తుకుపోయిన దొంగవు నువ్వు అన్నారు. టీడీపీ జెండా నందమూరి వారిది అన్నారు. వైసీపీ అధినేత వైయస్ జగన్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, తెలంగాణ సీఎం కేసీఆర్‌లది సొంత అజెండా అన్నారు. చంద్రబాబుకు దమ్మూ ధైర్యం ఉంటే ఎన్టీఆర్ జెండాను పక్కనబెట్టి నీ సొంత జెండాతో పోటీ చేయాలని సవాల్ విసిరారు.

నా ఆలోచన విధానం అదే
టీడీపీకి ఈ రోజుకు కూడా ఓట్లు వస్తున్నాయంటే ఎన్టీఆర్‌ను చూసి, ఆ జెండాను చూసి అని మోత్కుపల్లి అన్నారు. ఎన్టీఆర్ బొమ్మ పెట్టి వర్థంతులు చేసి గెలవాలని చంద్రబాబు చూస్తున్నాడని ధ్వజమెత్తారు. ప్రజలు ఈ విషయం అర్థం చేసుకోవాలన్నారు. ఇప్పటి జనరేషన్‌కు ఈ విషయం అర్థం కావాలని నేను చెబుతున్నానని చెప్పారు. ఏది ఏమైనా నా గొంతు ఎన్టీఆర్ కోసం, ఆయన ఆశయ సాధనం కోసం, అంబేద్కర్ ఆలోచనా విధానం కోసమన్నారు.

చంద్రబాబును దింపాలని మోత్కుపల్లి అన్నారు
నాయకులను వాడుకొని వదిలేయడం చంద్రబాబు నైజమని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఆరోపించారు. అనుభవం ఉన్న దళిత నేత మోత్కుపల్లిని సస్పెండ్ చేయడం దారుణమన్నారు. చంద్రబాబు దళిత వ్యతిరేక బుద్ధి బయటపడిందన్నారు. చంద్రబాబును అధికారం నుంచి దింపాలని మోత్కుపల్లి చెప్పారని, విజయసాయి రెడ్డి అన్నారు.

మోత్కుపల్లి - విజయసాయి భేటీపై నవ్వేసిన చంద్రబాబు
కాగా, విజయ సాయి రెడ్డి, మోత్కుపల్లి నర్సింహులు భేటీపై ఏపీ సీఎం చంద్రబాబు నవ్వి ఊరుకున్నారని తెలుస్తోంది. మోత్కుపల్లి తిరుమల యాత్రకు వైసీపీ మద్దతిస్తున్నట్లు విజయసాయి ఆయనకు చెప్పడం, ఆయన ఇంటికి వెళ్లడం తెలిసిన చంద్రబాబు నవ్వి ఊరుకున్నారట.












Click it and Unblock the Notifications