Aditya L1: శ్రీవారి సేవలో ఇస్రో సైంటిస్టులు
తిరుపతి: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్ 3.. జాబిల్లిపై తన అసలు పనికి శ్రీకారం చుట్టింది. విక్రమ్ ల్యాండర్ మాడ్యుల్ నుంచి ఇదివరకే బయటికి వచ్చి చంద్రుడి ఉపరితలంపై అడుగు పెట్టిన ప్రజ్ఞాన్ రోవర్.. తన పని తాను చేసుకోవడాన్ని మొదలు పెట్టింది.
ఈ విజయం ఇచ్చిన ఊపుతో మరో కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది ఇస్రో. సూర్యుడిపై ప్రయోగాలకు సన్నద్ధమైంది. దీనికోసం ఆదిత్య ఎల్ 1 ప్రాజెక్ట్‌ను చేపట్టింది. సెప్టెంబర్ 2వ తేదీన అంటే శనివారం ఉదయం 11:50 నిమిషాలకు ఆదిత్య ఎల్ 1 శాటిలైట్.. సూర్యుడి వైపు దూసుకెళ్లడానికి సిద్ధంగా ఉంది. దీనికి అవసరమైన కౌంట్ డౌన్ కూడా ఆరంభమైంది.

దీన్ని మోసుకెళ్లడానికి పీఎస్ఎల్వీ సీ-57 రాకెట్‌ను వినియోగించనుంది ఇస్రో. ప్రయోగించిన రోజు నుంచి ఈ శాటిలైట్ సూర్యుడి దీర్ఘ వృత్తాకార కక్ష్యలోకి ప్రవేశిస్తుంది. 110 నుంచి 120 రోజుల తరువాత ఎల్1కు చేరుకుంటుంది. దీనికి సంబంధించిన తుదిదశ కసరత్తు పూర్తయినట్లు ఇస్రో తెలిపింది.
ఈ నేపథ్యంలో- ఇస్రో శాస్త్రవేత్తలు తిరుమలకు వచ్చారు. శ్రీవేంకటేశ్వర స్వామివారి సేవలో పాల్గొన్నారు. ఈ ఉదయం వారు శ్రీవారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు చేశారు. ఆదిత్య ఎల్1 మిషన్ విజయవంతం కావాలని ప్రార్థించారు. దాదాపుగా కౌంట్ డౌన్ ఆరంభమైన సమయంలోనే వారు శ్రీవారిని దర్శించుకున్నారు.

తిరుమలకు వచ్చిన ఇస్రో శాస్త్రవేత్తలను తిరుమల తిరుపతి దేవస్థానం అర్చకులు, అధికారులు సాదర స్వాగతం పలికారు. దర్శనానంతరం ప్రధాన ఆలయం వెలుపల గల రంగనాయకుల మండపంలో వారికి తీర్థ ప్రసాదాలను అందజేశారు. వేదాశీర్వచనాలను పలికారు. శేషవస్త్రాలను బహూకరించారు.












Click it and Unblock the Notifications