అయోధ్య రామయ్య చెంతకు చేరిన శ్రీవారి అపురూప కానుకలు
Ayodhya Ram Mandir: ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో రామ మందిరం ప్రారంభోత్సవానికి కౌంట్ డౌన్ మొదలైంది. ఇంకొక్క రోజే మిగిలివుంది. శతాబ్దాల నాటి కల సాకారం కానుంది. సోమవారం మధ్యాహ్నం మహోజ్వల ఘట్టం ఆవిష్కృతం కానుంది. కోట్లాదిమంది హిందువుల ఆరాధ్య దైవం శ్రీరాముడు జన్మించిన పుణ్యస్థలంలో నిర్మితమైన రామమందిరం భక్తులకు అందుబాటులోకి రానుంది.
రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ఠ కోసం అయోధ్యనగరం సిద్ధమైంది. అయోధ్యాపురి మొత్తం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఇక్కడి ఆలయాలన్నింటినీ కూడా విద్యుద్దీపాలతో అలంకరించారు. రామ నామ జపంతో ఈ నగరం మారుమోగిపోతోంది. సరయూ నది తీరం మొత్తం రామభక్తులతో నిండిపోయింది. ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరుస్తోంది.

ఇప్పటికే అయోధ్యా రాముడు గర్భగుడిలోకి ఏతెంచిన విషయం తెలిసిందే. కర్ణాటక మైసూరుకు చెందిన ప్రఖ్యాత శిల్పి అరుణ్ యోగిరాజ్ తీర్చిదిద్దిన విగ్రహం ఇది. దీని ఎత్తు 51 అంగుళాలు. నల్లరాతిపై శ్రీరామచంద్రుడి నిలువెత్తు విగ్రహాన్ని చెక్కారు. 150 నుంచి 170 కిలోల బరువు ఉంటుంది. 70 సంవత్సరాలుగా రామ జన్మభూమిలో పూజలు అందుకుంటోన్న రామ్ లల్లా విగ్రహం గర్భాలయంలోనే ఉంచారు.

రామ్ లల్లా విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠోత్సవ కార్యక్రమాన్ని పురస్కరించుకుని తిరుమల తిరుపతి దేవస్థానం.. లక్ష లడ్డూ ప్రసాదాలను కానుకగా పంపించిన విషయం తెలిసిందే. పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, పారిశ్రామికవేత్తలు, బాలీవుడ్ నటీనటులు, సెలెబ్రిటీలకు లడ్డూ ప్రసాదాన్ని టీటీడీ పంచిపెట్టనుంది.

ఒక్కో లడ్డూ బరువు 25 గ్రాములు. ప్రతి ఒక్కరికీ రెండు లడ్డూలను శ్రీవారి ప్రసాదంగా అందిస్తుంది. తిరుమలలోని శ్రీవారి సేవాసదన్- 1లో శ్రీవారి సేవకులు ఒక్కో కవర్‌లో రెండు చిన్న లడ్డూలు చొప్పున ప్యాకింగ్ చేశారు. తిరుపతి విమానాశ్రయం నుంచి ప్రత్యేక కార్గో విమానంలో అవి అయోధ్యకు చేరుకున్నాయి.
వాటిని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్‌కు అందజేయనున్నారు టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. ఆహ్వానితులకు లడ్డూ ప్రసాదాలను పంచి పెట్టే కార్యక్రమాన్ని ఆయన స్వయంగా పర్యవేక్షించనున్నారు. దీనికోసం అయోధ్యకు చేరుకున్నారు. లడ్డూ పంపిణీ ఏర్పాట్లను పరిశీలించారు.












Click it and Unblock the Notifications