టీటీడీ ఈవోగా శ్యామలారావు నియామకం
తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్(ఈవో)గా ఐఏఎస్ అధికారి జే శ్యామలరావు నియమితులయ్యారు. ప్రస్తుతం ఈవోగా ఉన్న ధర్మారెడ్డిని ఏపీ ప్రభుత్వం తొలగించింది. దీంతో ఆయన సెలవుపై వెళ్లారు. జూన్ 11 నుంచి 17 వరకూ వ్యక్తిగత కారణాల రీత్యా సెలవు మంజూరు చేస్తున్నట్టు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.
ధర్మారెడ్డి విధులు నిర్వహించే చోటు నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లినా రాష్ట్రం దాటి వెళ్లొద్దని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. మరో వైపు ఈ నెలాఖరున ధర్మారెడ్డి ఉద్యోగ విరమణ చేయనున్నారు. అంతలోనే ధర్మారెడ్డిని రాష్ట్ర ప్రభుత్వం విధుల నుంచి తొలగించింది.

ఈ క్రమంలో ప్రస్తుతం విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న శ్యామలరావు టీటీడీ ఈవోగా నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శ నీరభ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు శుక్రవారం జారీ చేశారు. కాగా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత తిరుమల వెళ్లిన సీఎం చంద్రబాబు నాయుడు.. శ్రీవారిని దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి గురువారం ఉదయం వెంకటేశ్వరస్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు సీఎం చంద్రబాబు.
ఈ సందర్భంగా చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రజాపాలన ప్రారంభమయిందని, ప్రజలందరూ భాగస్వాములు కావాలన్నారు. అంతేగాక, తిరుమల తిరుపతి దేవస్థానం నుంచే ప్రక్షాళన మొదలుపెడతామని ప్రకటించారు. తిరుమలలో ఓం నమో వెంకటేశాయా, గోవింద నామస్మరణ తప్ప మరో నినాదమే వినపడకుండా చేస్తామని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications