Tirumala: తిరుమలలో పద్మావతి శ్రీనివాసుల పరిణయోత్సవాలు..
తిరుమలలోని నారాయణ ఉద్యానవనాల్లో నేటి నుంచి 3 రోజుల పాటు జరగనున్న పద్మావతి శ్రీనివాసుల పరిణయోత్సవాలకు ఏర్పాట్లు చేసినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. మూడురోజులపాటు జరుగనున్న ఈ వేడుకలో తొలిరోజు గజవాహనంపై మలయప్పస్వామివారికి సేవ చేయనున్నారు. రెండవరోజు అశ్వవాహనంపై, చివరిరోజు గరుడవాహనంపై వేంచేపు చేస్తారు. మరోపక్కఉభయనాంచారులు ప్రత్యేక పల్లకీలలో పరిణయోత్సవ మండపానికి వేంచేపు చేయనున్నారు. ఆ తర్వాత కల్యాణమహోత్సవం ఘనంగా నిర్వహించనున్నారు.
ఆనాటి పద్మావతీ శ్రీనివాసుల కల్యాణోత్సవ ముహూర్తానికి గుర్తుగా ప్రతి వైశాఖ శుద్ధ దశమినాటికి ముందు ఒక రోజు, తరువాత ఒక రోజు కలిపి మొత్తం మూడురోజుల పాటు పద్మావతీ పరిణయోత్సవాన్ని టీటీడీ 1992వ సంవత్సరం నుంచి నిర్వహిస్తోంది. ఆనాటి నారాయణవనానికి ప్రతీకగా తిరుమల నారాయణగిరి ఉద్యానవనంలో పద్మావతీ పరిణయ వేడుకలు జరగనున్నాయి. టీటీడీ ఉద్యానవన విభాగం ఆధ్వర్యంలో పరిణయోత్సవ మండపాన్ని తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన 30 మంది, తమిళనాడుకు చెందిన 50 మంది అలంకార నిపుణులు అలంకరించారని టీటీడీ ఉద్యానవన సూపరింటెండెంట్ శ్రీనివాసులు చెప్పారు.

పూణేకు చెందిన దాత రూ.24 లక్షలతో వేదికను వైభవంగా ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చినట్లు తెలిపారు. శుక్రవారం శ్రీవారి దర్శనానికి భక్తులు 11 కంపార్ట్‌మెంట్లలో వేచియున్నారు. టోకెన్లు లేని భక్తులకు దర్శనానికి 18 గంటల సమయం పట్టిందని టీటీడీ అధికారులు తెలిపారు. శనివారం రోజు కూడా భక్తుల రద్దీ ఉండే అవకాశం ఉందని తెలిపారు. గురువారం స్వామివారిని 65,910 మంది భక్తులు దర్శించుకోగా 27,838 మంది తలనీలాలు సమర్పించుకున్నారు.
భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 2.80 కోట్లు వచ్చిందని అధికారులు తెలిపారు. మే 4న తిరుమలలో నృసింహ జయంతిని నిర్వహిస్తున్నామని వివరించారు. ప్రతి ఏటా వైశాఖ మాసం స్వాతి నక్షత్రంలో నృసింహ జయంతిని నిర్వహిస్తామని, యోగ నరసింహస్వామివారి మూలమూర్తికి ప్రత్యేక అభిషేకం చేస్తారని అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ తన రెండు రోజుల తొలి తిరుమల పర్యటన నిమిత్తం శుక్రవారం సాయంత్రం తిరుమలలోని పద్మావతి విశ్రాంతి గృహానికి చేరుకున్నారు.
అక్కడకు చేరుకున్న ఆయనకు టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి స్వాగతం పలికారు. గవర్నర్ వెంట ఆయన కార్యదర్శి ఎకె సింఘాల్, కలెక్టర్ వెంకట్రమణారెడ్డి, ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి, డివై ఇఓ హరీంద్రనాథ్, ఇతర జిల్లా, టిటిడి అధికారులు ఉన్నారు.












Click it and Unblock the Notifications