అత్తారింటికి దారేది దేఖా..మజా ఆయా: పవన్ జాతీయస్థాయి నేత: వైసీపీ, టీడీపీలో ఉన్నారా? బీజేపీ
తిరుపతి: తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నిక పోలింగ్ గడువు సమీపిస్తోెన్న కొద్దీ భారతీయ జనతా పార్టీ తన ప్రచార పర్వాన్మి ముమ్మరం చేస్తోంది. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీలను నేరుగా ఢీ కొడుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో.. తన శక్తియుక్తులను ప్రదర్శిస్తోంది. వ్యూహ ప్రతివ్యూహాలతో ప్రత్యర్థులను ఉక్కిరిబిక్కిరికి గురి చేస్తోంది. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎమ్మార్పీఎస్) నేతల మద్దతును కూడగట్టుకోవడం బీజేపీ రాజకీయ చతురతకు అద్దం పడుతున్నట్టు భావిస్తున్నారు. జనసేన పార్టీని కూడా ప్రచార బరిలోకి దించింది. ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఈ శనివారం బీజేపీ అభ్యర్థి రత్నప్రభకు మద్దతుగా తిరుపతిలో పాదయాత్ర నిర్వహించనున్నారు.
తిరుపతి ఉప ఎన్నిక ప్రచారానికి తెలంగాణ ఫైర్‌బ్రాండ్: నాడునిప్పు రాజేసి..!
తిరుపతి ఉప ఎన్నిక స్థానాన్ని తమకు వదులుకోవడంతో పాటు రత్నప్రభను ఉమ్మడి అభ్యర్థిగా గుర్తించిన పవన్ కల్యాణ్‌ను బీజేపీ నాయకులు ఆకాశానికెత్తేస్తోన్నారు. ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్న ప్రతీసారీ.. ప్రతీ చోట పవన్ కల్యాణ్ పేరును ప్రస్తావిస్తున్నారు. ఆయన నామాన్ని జపిస్తున్నారు. తిరుపతి లోక్‌సభ పరిధిలోని సత్యవేడు అసెంబ్లీ నియోజకవర్గంలో నిర్వహించిన ప్రచార కార్యక్రమాల్లో సునీల్ దేవ్‌ధర్ పాల్గొన్నారు. పవన్ కల్యాణ్‌ను జాతీయ స్థాయి నాయకుడిగా అభివర్ణించారు.

ఇటీవలే తాను అత్తారింటికి దారేది సినిమాను చూశానని సునీల్ దేవ్‌ధర్ చెప్పారు. ఆ సినిమా మజా ఇచ్చిందని వ్యాఖ్యానించారు. అందులో పవన్ కల్యాణ్ ఓ హిందీ పాటను పాడారని ప్రస్తావించారు. ఆ పాట అంటే తనకు చాలా ఇష్టమని పవన్ కల్యాణ్ తనతో చెప్పినట్లు సునీల్ దేవ్‌ధర్ పేర్కొన్నారు. పవన్ కల్యాణ్ ఓ నేషనలిస్ట్ లీడర్ అని ప్రశంసించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్‌లో గానీ, తెలుగుదేశం పార్టీలో గానీ పవన్ కల్యాణ్ వంటి జాతీయ స్థాయి నాయకులు లేరని అన్నారు. పవన్ కల్యాణ్ గొప్ప నటుడని, అందులో సందేహాలు అక్కర్లేదని అన్నారు. తాను కూడా పవన్ కల్యాణ్‌కు అభిమానని చెప్పుకొచ్చారు.
అత్తారింటికి దారేది దేఖా..మజా ఆయా: పవన్ జాతీయస్థాయి నేత: వైసీపీ, టీడీపీలో ఉన్నారా? బీజేపీ#TirupatiLokSabhabyelection2021 #BJP #RatnaPrabha #PawanKalyan #SunilDeodhar pic.twitter.com/mZKUX3TdVG
— oneindiatelugu (@oneindiatelugu) March 31, 2021
తాను వకీల్ సాబ్ ట్రైలర్ చూశానని రత్నప్రభ చెప్పుకొచ్చారు. జనసైనికులతో కలిసి చాలా ఎగ్జైటింగ్‌గా ఆ ట్రైలర్‌ను చూశానని అన్నారు. వకీల్ సాబ్ మూవీ కోసం అంతే ఎగ్జైటింగ్‌గా ఎదురు చూస్తున్నానని అన్నారు. పవన్ కల్యాణ్ తమ పార్టీకి మద్దతు ఇవ్వడంతో తన గెలుపు ఏకపక్షమౌతుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కోట్లాదిమంది అభిమానులు ఉన్న పవన్ కల్యాణ్ వంటి నటుడు, రాజకీయ నాయకుడు.. తన కోసం తిరుపతిలో పాదయాత్ర చేయడానికి సంసిద్ధతను వ్యక్తం చేయడం గొప్ప విషయమని, అది ఆయన నిరాడంబరతను సూచిస్తోందని రత్నప్రభ వ్యాఖ్యానించారు.