వేగంగా మారుతున్న సీన్.. తిరుపతిలో పోటీకి జనసేన ఆసక్తి..? పవన్ లెక్క వేరే.. ఏం జరగబోతోంది..
కలిసి నడిచే దారిలో ఎవరి లెక్కలు వారివైతే కష్టం... సయోధ్య కుదరకపోతే,రాజీ పడకపోతే 'పొత్తు' లెక్క తప్పుతుంది... ఆంధ్రప్రదేశ్‌లో 'తిరుపతి' కేంద్రంగా వేగంగా మారుతున్న రాజకీయాలు ఈ చర్చకు ఊతమిస్తున్నాయి. తిరుపతి వైసీపీ ఎంపీ బల్లి దుర్గా ప్రసాద్ అకాల మరణంతో ఇక్కడ ఉపఎన్నిక అనివార్యమైంది. ఇటీవల తెలంగాణలోని 'దుబ్బాక' ఉపఎన్నికలో బీజేపీ గెలుపు.. ఏపీలోని కమలనాథుల్లో ఆశలు చిగురించేలా చేసింది. తిరుపతి ఆధ్యాత్మిక నగరం కావడం... బీజేపీ హిందుత్వ ఎజెండా ఉన్న పార్టీ కావడంతో.. ఇక్కడ తాము గెలుపు జెండా ఎగరవేయవచ్చునని ఆ పార్టీ భావిస్తోంది. అదే సమయంలో మిత్రపక్షం జనసేన కూడా తనదైన లెక్కతో ముందుకు కదులుతున్నట్లు ఊహాగానాలు బయలుదేరాయి. ఇంతకీ జనసేన లెక్కేంటి... తిరుపతి బరిలో బీజేపీ-జనసేన రాజకీయం ఎలా ఉండబోతుంది...
Recommended Video

పోటీ చేస్తామని ప్రకటించిన బీజేపీ...
తిరుపతి ఉపఎన్నికలో తాము పోటీ చేయబోతున్నట్లు బీజేపీ ప్రకటించింది. ఇందుకు జనసేన మద్దతు కూడా ఉందని తెలిపింది. ఇప్పటికే క్షేత్ర స్థాయిలో సన్నాహక కార్యక్రమాలు కూడా మొదలుపెట్టింది. గత చరిత్రను పరిశీలిస్తే తిరుపతిలో బీజేపీ ఒకే ఒక్కసారి గెలిచింది. 1999 ఎన్నికల్లో టీడీపీతో పొత్తు కారణంగా తిరుపతి ఎంపీ టికెట్ బీజేపీకి దక్కింది. ఆ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి నందిపాకు వెంకటస్వామి విజయం సాధించారు. ఆ తర్వాత బీజేపీ మళ్లీ అక్కడ గెలిచింది లేదు. అయితే ఇటీవల తెలంగాణలోని దుబ్బాక ఉపఎన్నికలో బీజేపీ గెలుపు కమలనాథుల్లో ఫుల్ జోష్ నింపింది. అక్కడ సోలిపేట రామలింగారెడ్డి మరణంతో ఖాళీ అయిన స్థానాన్ని బీజేపీ దక్కించుకున్నట్లే... ఇక్కడ బల్లి దుర్గా ప్రసాద్ మరణంతో ఖాళీ అయిన స్థానాన్ని తాము దక్కించుకుంటామన్న ధీమాతో ఉంది.

జనసేన ఆసక్తి కనబరుస్తోందా..?
ఓవైపు తిరుపతిలో పోటీ చేసేది తామేనని బీజేపీ ప్రకటించినప్పటికీ... జనసేన కూడా ఇక్కడినుంచి పోటీ చేసేందుకు ఆసక్తిని కనబరుస్తోందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మంగళగిరిలోని ఆ పార్టీ కార్యాలయంలో ఈ నెల 16,17 తేదీల్లో జరగనున్న క్రియాశీలక సమావేశాల్లో 'తిరుపతి'లో పోటీ అంశాన్ని జనసేనాని పవన్ చర్చించే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. సభ్యత్వ నమోదు విజయవంతమైన నేపథ్యంలో ఈ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు చెప్తున్నప్పటికీ.. 'తిరుపతి'పై ఫోకస్ పెట్టేందుకే ఈ మీటింగ్స్ అన్న చర్చ కూడా జరుగుతోంది.

దుబ్బాకలో ప్రచారానికి పవన్ వెళ్లి ఉంటే...
తిరుపతి ఉపఎన్నికలో పోటీకి జనసేన కూడా ఆసక్తి కనబరుస్తోందన్న ఊహాగానాలు.. తిరుపతి రాజకీయాన్ని మరింత రక్టి కట్టిస్తున్నాయి. ఒకవేళ తిరుపతిలో పోటీకి జనసేన పట్టుబడితే బీజేపీ ఎలా స్పందిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. ఇద్దరిలో ఎవరు రాజీ పడుతారు.. ఎలా సయోధ్య కుదురుతుందన్నది ఆసక్తిని రేకెత్తిస్తోంది. నిజానికి తెలంగాణలోని దుబ్బాక ఉపఎన్నికలో పవన్ కల్యాణ్ కూడా ప్రచారం నిర్వహిస్తారన్న ప్రచారం జరిగింది. కారణాలేంటో తెలియదు గానీ.. ఆయన మాత్రం ప్రచారానికి వెళ్లలేదు. ఒకవేళ పవన్ అక్కడ ప్రచారానికి వెళ్లి ఉంటే... దుబ్బాక గెలుపులో ఆయనకూ క్రెడిట్ దక్కేది. అప్పుడు తిరుపతి సీటు అడిగేందుకు బలమైన ప్రాతిపదిక ఏర్పడి ఉండేది. ఒకవేళ తిరుపతి ఉపఎన్నికపై పోటీ విషయంలో రెండు పార్టీల మధ్య విభేదాలు తలెత్తితే ఫలితాలై దాని ప్రభావం ఉండకపోదు. కాబట్టి ఈ విషయంలో రెండు పార్టీలు ఆచీ తూచీ అడుగులు వేసే అవకాశం ఉంది.

ప్రత్యేక హోదాపై ఏం చెప్తారు...
గతంలో ఇదే తిరుపతి వేదికగా ప్రధాని నరేంద్ర మోదీ ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇదే తిరుపతి వేదికగా... హోదాకు బదులు ప్యాకేజీ పేరుతో 'పాచిపోయిన లడ్డూలు' ఇచ్చారంటూ కేంద్రంపై ఘాటైన విమర్శలు చేశారు. కాబట్టి అధికార వైసీపీ తిరుపతి ఉపఎన్నికలో ప్రత్యేక హోదా అంశాన్ని హైలైట్ చేసే అవకాశం లేకపోలేదు. అదే జరిగితే... బీజేపీ,జనసేన ప్రజలకు ఏం సమాధానం చెప్తాయన్నది వేచి చూడాలి. ఇప్పటికే హోదా అంశాన్ని అటకెక్కించడంతో... ఉపఎన్నికలో ఈ అంశాన్ని ఎలా ఎదుర్కోవాలా అన్న దానిపై ఈ రెండు పార్టీలు మల్లగుల్లాలు పడుతున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications