ఈ నెల 18వ తేదీన.. తిరుమలలో..!!
శ్రీవేంకటేశ్వరస్వామివారి పరమ భక్తుడు, తొలి తెలుగు వాగ్గేయకారుడు తాళ్లపాక అన్నమాచార్య 520వ వర్ధంతి సందర్భంగా ఈ నెల 18వ తేదీన తిరుమలలో ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు.
తిరుమల: ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ మళ్లీ పెరిగింది. 18 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉంటోన్నారు. సర్వదర్శనానికి 20 నుంచి 24 గంటల సమయం పడుతోంది. గురువారం 58,494 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. వారిలో 24,025 మంది తలనీలాలను సమర్పించారు. స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి హుండీ ద్వారా 3.91 కోట్ల రూపాయలు ఆదాయం లభించింది.
ఈ నెల 18వ తేదీన పదకవిత పితామహుడు, తొలి తెలుగు వాగ్గేయకారుడు తాళ్లపాక అన్నమాచార్యులవారి వర్ధంతి. శ్రీవేంకటేశ్వరస్వామివారికి పరమ భక్తుడైన అన్నమాచర్య 520వ వర్ధంతి కార్యక్రమాన్ని టీటీడీ అధికారులు తిరుమలలో నిర్వహించనున్నారు. సాయంత్రం 5:30 గంటలకు ఈ కార్యక్రమాలు ఆరంభమౌతాయి. ఇందులో భాగంగా శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారిని ఊరేగించనున్నారు.

సాయంత్రం 5:30 గంటలకు శ్రీమలయప్ప స్వామివారు ఊరేగింపుగా శ్రీవారి ఆలయం నుంచి బయలుదేరుతారు. 6 గంటలకు నారాయణగిరి ఉద్యానవనాలకు వేంచేస్తారు. అనంతరం ప్రముఖ కళాకారులతో దిన ద్వాదశి సంకీర్తనలు, సప్తగిరి సంకీర్తనల గోష్ఠిగానం నిర్వహిస్తారు. అనంతరం అహోబిలం శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానం 46వ పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ శఠగోప శ్రీరంగనాథ యతీంద్ర మహాదేశికన్ స్వామివారు అనుగ్రహ భాషణం చేస్తారు. తాళ్లపాక వంశీయులకు సన్మానంతో ఈ కార్యక్రమం ముగుస్తుంది.
అన్నమాచార్యులవారి పద సంకీర్తనలతో తిరుమల గిరులు ప్రతిధ్వనించనున్నాయి. తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారితో పాటు, అహోబిలంలో వెలసిన శ్రీలక్ష్మీనరసింహ స్వామిని కీర్తిస్తూ 32 వేలకు పైగా కీర్తనలను రచించిన పరమభక్తుడు అన్నమయ్య. సాక్షాత్ శ్రీమహావిష్ణువు ఖడ్గమైన నందకం అంశతో అన్నమయ్య జన్మించాడని భక్తులు విశ్వసిస్తారు.
వారం రోజులుగా తిరుపతిలోని అన్నమాచార్య కళా మందిరం, మహతి ఆడిటోరియం, తిరుమల నారాయణగిరి ఉద్యానవనం, ధ్యాన మందిరంలో ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తోన్నారు. అన్నమయ్య రాయచోటి జిల్లాలోని తాళ్లపాకలో నిర్మించిన 108 అడుగుల అన్నమయ్య విగ్రహం వద్ద కూడా వర్ధంతి ఉత్సవాలు ఏకకాలంలో నిర్వహించనున్నారు. ఈ నెల 18వ తేదీన శ్రీమలయప్ప స్వామివారి ఊరేగింపు, శ్రీరంగనాథ యతీంద్ర మహాదేశికన్ స్వామివారి అనుగ్రహ భాషణంతో ఇవి ముగియనున్నాయి.












Click it and Unblock the Notifications