శ్రీవారి ఆలయం సమీపంలోకి, టీటీడీ కోరినా - భక్తుల ఆందోళన..!!
Tirumala: తిరుమల శ్రీవారి ఆలయ సమీపం నుంచి వరుసగా విమానాలు వెళ్లటం కలకలంగా మారింది. గురువారం ఉదయం వెంట వెంటనే మూడు విమానాలు వెళ్లటంతో టీటీడీ అప్రమత్తమైంది. అవి ఎక్కడ నుంచి వచ్చాయో తెలియక పోవటం ఆందోళనకు కారణమవుతోంది. ఈ ఘటనపై టీటీడీ భద్రతాధికారులు ఆరా తీస్తున్నారు. ఆగమశాస్త్రం ప్రకారం తిరుమల పైనుంచి విమానాలు వెళ్లకూడదు. కొద్ది రోజులుగా వరుసగా విమానాలు తిరుమల మీదుగా వెళ్లటంపై భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఆలయం సమీపంలోకి విమానాలు:
తిరుమలలో గురువారం ఏకంగా మూడు విమానాలు తిరుమల శ్రీవారి ఆలయం సమీపంలో వెళ్లాయి. ఉదయం 7.45, 8.00, 8.22 గంటలకు వరుసగా మూడు విమానాలు ప్రయాణించాయి. ఆగమశాస్త్రం ప్రకారం తిరుమల పైన నుంచి విమానాలు వెళ్లకూడదు. దీనిపైన గతంలోనే టీటీడీ అధికారులు పౌర విమానాయాన శాఖను సంప్రదించారు.

అయితే, తాము ఈ నిబంధన అమలు చేయటం వీలుకాదని అప్పట్లోనే ఆ శాఖ ఉన్నతాధికారులు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. రక్షణ పరంగా సమస్య ఉన్న ప్రాంతాలను నో ఫ్లయింగ్ జోన్ గా ప్రకటిస్తారు. తిరుమలకు ఉన్న ప్రత్యేకత..విశిష్ఠత కారణంగా నో ఫ్లయింగ్ జోన్ లోకి తీసుకురావాలని ప్రతిపాదించినా కేంద్రం నుంచి సానుకూల స్పందన లేదు.
స్పందించని కేంద్రం:
దీంతో తిరుమల మీదుగా విమానాలు..హెలికాఫ్టర్లు వెళ్లిన సమయంలో టీటీడీ అధికారులు విమానయాన శాఖకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకుంటున్నారు. ఆ విమానాలు రాకపోకలపైన ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో తిరుమలలో ఆక్టోపస్ భద్రతా సిబ్బందితో పహారా ఏర్పాటు చేసారు.
గగనతలంలో మాత్రం సమస్యగా మారుతోంది. నెల రోజుల సమయంలో మూడు సార్లు విమానాలు ఇలా ఆలయానికి అతి సమీపంలో ప్రయాణిచటంపైన భక్తులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా కేంద్రం స్పందించి ఆలయం సమీపంలో విమానాల రాకపోకలపై నిషేధం విధించేలా చర్యలు తీసుకోవాలనేది భక్తుల కోరిక. ఇప్పటికైనా కేంద్రం స్పందిస్తుందా లేదా చూడాలి.
కొనసాగుతున్న భక్తుల రద్దీ:
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వీకెండ్ కావడంతో భక్తుల రద్దీ మరింత పెరిగింది. నేడు (శుక్రవారం) క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్టుమెంట్లన్నీ నిండి క్యూలైన్లు వెలుపలికి వచ్చాయి. స్వామివారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. ఇక గురువారం శ్రీవారిని 70,160 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
శ్రీవారి హుండీ ఆదాయం 3.67 కోట్ల రూపాయలు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. జూలై 15వ తేదీ వరకు వీఐపీ బ్రేక్ దర్శనాల పైన టీటీడీ నియంత్రణ పాటిస్తోంది. సాధారణ భక్తులకు ప్రాధాన్యత ఇచ్చే నిర్ణయాలను అమలు చేస్తోంది.












Click it and Unblock the Notifications