Tirumala : తిరుమల స్వామివారికి భక్తుడి భారీ విరాళం...
ఆంధ్రప్రదేశ్‌లోని తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు నిత్యం భక్తులు తరలివస్తుంటారు. భారీ కానుకలు సమర్పిస్తుంటారు. తాజాగా ఓ భక్తుడు తిరుమల స్వామివారికి భారీ విరాళాన్ని అందజేశారు. శ్రీవేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు విశాఖపట్నానికి చెందిన హిందుస్థాన్ ఎంటర్‌ప్రైజెస్ అధినేత పువ్వాడ శేషమస్తాన్‌రావు, కుంకుమరేఖ దంపతులు కోటిరూపాయలు విరాళంగా ప్రకటించారు. ఈ మేరకు విశాఖ దంపతులు గురువారం నాడు తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో ఏవీ ధర్మారెడ్డిని కలిసి డీడీని సమర్పించారు.
తిరుమల స్వామి వారిని దర్శించుకునేందుకు దేశంలోని ప్రతి ప్రాంతం నుంచి భక్తులు బారులు తీరుతుంటారు. ఇక్కడికి వచ్చి చాలామంది తమ తమ మొక్కులు తీర్చుకోవడం ఆనవాయితీ. ఇక్కడికి వచ్చిన భక్తులు తమకు తోచినంత వీలైనంత స్వామి వారి హుండీలో సమర్పించుకుంటారు. అలానే విశాఖపట్నానికి చెందిన ఓ జంట కోటిరూపాయల విరాళాన్ని స్వామివారికి అందజేసారు. అనంతరం వారు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆ తర్వాత ఆలయ వేద పండితుల ఆశీర్వచనాలు తీసుకున్నారు. ఆలయ అధికారులు శేష వస్త్రంతో ఆ దంపతులను సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేయడం జరిగింది.

తిరుపతిలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలు...
తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఉన్న తిరుపతిలోని మహతి ఆడిటోరియంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఎంతో వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో టీటీడి పాలకమండలి ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పురాణాల ప్రకారం ఆదిదేవతని మహిళ అన్నారు. చాలా గ్రామాల్లో గ్రామదేవతలు మహిళలని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమానికి పద్మశ్రీ అవార్డు గ్రహిత తొలి మహిళా మృదంగం కళాకారిణి దండమూడి సుమతి రాంమోహన్ రావు, ప్రముఖ గాత్ర కళాకారిణి డా. ద్వారం లక్ష్మీ, ఆసియన్ గేమ్స్ పతక విజేత, అథ్లెట్ కుమారి నందిని అగసార తదితరులు పాల్గొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానంలోని వివిధ విభాగాల్లో విశేష సేవలు అందిస్తున్న 20 మంది మహిళా ఉద్యోగులకు ఈ సందర్భంగా పద్మావతి అవార్డులు ప్రదానం చేశారు. వీరిని శాలువతో సన్మానించి ఐదు గ్రాముల వెండి డాలర్, శ్రీ పద్మావతి అమ్మవారి జ్ఞాపికను అందజేయడం జరిగింది.












Click it and Unblock the Notifications