తిరుపతిలో మెగా ప్రాజెక్టులు- శ్రీవారి భక్తుల కోసం..!!
తిరుమల: ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉంటోన్నారు. సర్వదర్శనానికి 20 గంటల సమయం పడుతోంది. గురువారం 62,407 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. వారిలో 33,895 మంది స్వామివారికి తలనీలాలను సమర్పించారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి హుండీ ద్వారా 4.56 కోట్ల రూపాయల ఆదాయం లభించింది.
తిరుమలకు వెళ్లే భక్తుల కోసం ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం శ్రీనివాస సేతు నిర్మాణానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన తిరుపతి స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్ కింద ఈ ఫ్లైఓవర్ మంజూరయింది. దీని మొత్తం నిర్మాణ వ్యయం 680 కోట్ల రూపాయలు. 90 శాతం నిర్మాణ పనులు పూర్తయ్యాయి. మూడో దశ పనులు కూడా ముగిశాయి. ప్రస్తుతం శ్రీనివాస సేతుపై వాహనాల రాకపోకల ట్రయల్ రన్‌ను చేపట్టారు అధికారులు.

ఈ నేపథ్యంలో- టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఇవ్వాళ శ్రీనివాస సేతు తుది విడత నిర్మాణ పనులను పర్యవేక్షించారు. బస్టాండ్ సమీపంలో నిర్మాణంలో ఉన్న రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులను ఆయన పరిశీలించారు. పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. బర్డ్స్ ఆధ్వర్యలో నిర్మిస్తోన్న చిన్న పిల్లల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి భవనం నిర్మాణాన్ని కూడా వైవీ సుబ్బారెడ్డి పరిశీలించారు.
అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. స్మార్ట్ సిటీ పథకం కింద నిర్మాణ పనులను కొనసాగుతున్నప్పటికీ- వీటికి అయ్యే ఖర్చులో 65 శాతానికి పైగా నిధులను టీటీడీ భరిస్తోందని అన్నారు. ఈ శ్రీనివాస సేతు వల్ల తిరుమలకు వచ్చే భక్తులకు ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు ఉండబోవని చెప్పారు. తిరుపతిలో ప్రవేశించే అవసరం లేకుండా నేరుగా అలిపిరి టోల్ గేట్ వద్దకు చేరుకునేలా ఈ ఎలివేటెడ్ ఎక్స్‌ప్రెస్‌ను డిజైన్ చేశామని అన్నారు.
ఇతర ప్రాంతాల నుంచి తిరుమలకు వెళ్లే వాహనాల వల్ల అటు తిరుపతి ప్రజలకు కూడా ఇబ్బందులు ఉండకూడదనే ఉద్దేశంతో ఈ ప్రాజెక్ట్‌కు టీటీడీ నిధులను సమకూరుస్తోందని చెప్పారు. త్వరలోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా దీన్ని ప్రారంభిస్తామని అన్నారు. చిన్న పిల్లల ఆసుపత్రిని ఈ ఏడాది డిసెంబర్ నాటికి అందుబాటులోకి తెచ్చేలా కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకున్నామని వివరించారు.












Click it and Unblock the Notifications