తిరుమల శ్రీవారి ఆలయం అరుదైన రికార్డు - చరిత్రలోనే తొలి సారిగా..!!
తిరుమల దేవస్థానం సరికొత్త రికార్డు లిఖించింది. ఆదాయంలో శ్రీవారి ఆలయం కొత్త రికార్డులు నమోదు చేస్తోంది.
Tirumala: తిరుమల దేవస్థానం సరికొత్త రికార్డు లిఖించింది. దేశంలో ఏ దేవాలయంకు లేని విధంగా ఆదాయంలో ముందు నిలిచింది. రూ 4,411.68 కోట్లతో టీటీడీ 2023-24 బడ్జెట్ అంచనాలకు టీటీడీ పాలక వర్గం ఆమోద ముద్ర వేసింది. ఈ మేరకు తిరుమల బడ్జెట్ అంచనాల వివరాలను ఛైర్మన్ సుబ్బారెడ్డి వెల్లడించారు. శ్రీవారి దర్శనం సామాన్యులకు సులభతరం చేసేందుకు వీఐపీ బ్రేక్ దర్శనం సమయం మార్పు ప్రయోజనకరంగా ఉందన్నారు. సామాన్య భక్తులకు ఎంతో ఉపయోగకరంగా ఉండటంతో ఈ విధానం కొనసాగిస్తామని ప్రకటించారు. వర్చువల్ సేవా టికెట్లు ఆన్ లైన్ లో కొనసాగిస్తామని స్పష్టం చేసారు.
ఆదాయంలో శ్రీవారి ఆలయం కొత్త రికార్డులు నమోదు చేస్తోంది. కోవిడ్ తరువాత హుండీ ఆదాయం గణనీయంగా పెరిగింది. కోవిడ్ కు ముందు ఏడాదికి రూ 1200 కోట్లు కానుకలు లభించేవి. కోవిడ్ తరువాత హుండీ ఆదాయం రూ 1500 కోట్ల దాకా పెరిగింది. బ్యాంకుల్లో ఉన్న టీటీడీ డిపాజిట్ల మీద కూడా వడ్డీ రేట్లు పెరిగాయి. టీటీడీ వివిధ బ్యాంకుల్లో డిపాజిట్ చేసిన నగదు, బంగారం ద్వారా వడ్డీ ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.813 కోట్లు వస్తుందని అంచనాగా చూపించారు. రానున్న ఆర్థిక సంవత్సరంలో రూ.990 కోట్లు వస్తుందని ఈ సారి బడ్జెట్ లో అంచనా వేసినట్లు సుబ్బారెడ్డి చెప్పారు. తిరుపతిలో నిర్మిస్తున్న శ్రీనివాస సేతు ఫ్లై ఓవర్ నిర్మాణం ఏప్రిల్ ఆఖరు నాటికి పూర్తి చేయించి ముఖ్యమంత్రి జగన్ ప్రారంభిస్తారని సుబ్బారెడ్డి వెల్లడించారు.

అలిపిరి నుండి వకుళామాత ఆలయం వరకు కొత్తగా రోడ్డు మంజూరు చేసినట్లు తెలిపారు. ఏప్రిల్ 5వ తేదీ ఒంటిమిట్ట శ్రీ కోదండ రామ స్వామి వారి కళ్యాణోత్సవం సందర్బంగా ముఖ్యమంత్రి జగన్ రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు,ముత్యాల తలంబ్రాలు సమర్పిస్తారని చెప్పారు. ఇక, వేసవిలో మూడు నెలలు భక్తుల రద్దీ బాగా పెరిగే అవకాశం ఉన్నందువల్ల విఐపి ల రెఫరల్స్ బాగా తగ్గించాలని సుబ్బారెడ్డి సూచించారు. ఆ దిశగా తాము చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. శ్రీవాణి టికెట్ల సంఖ్య కూడా తగ్గించి ఎక్కువమంది సామాన్య భక్తులకు దర్శనం కల్పిస్తామని చెప్పారు. తిరుమల లో భక్తుల అవసరాలకు అనుగుణంగా లడ్డూ కాంప్లెక్స్ వద్ద 30 అదనపు లడ్డూ కౌంటర్ల నిర్మాణానికి రూ 5.25 కోట్లు మంజూరు చేసినట్లు సుబ్బారెడ్డి వెల్లడించారు.
తమిళనాడు రాష్ట్రం ఊలందూరు పేటలో దాత విరాళంతో నిర్మిస్తున్న శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో రూ 4.70 కోట్లతో కొన్ని అభివృద్ధి పనులు చేపట్టడానికి నిర్ణయించినట్లు వివరించారు. తిరుపతి లోని ఎస్ జి ఎస్ ఆర్ట్స్ కళాశాల పడమరవైపు మూడో అంతస్తు నిర్మాణం, ల్యాబ్ ఆధునీకరణ, గ్రంథాలయం, ఇండోర్ గేమ్స్ భవనాల నిర్మాణం తదితర పనుల కోసం రూ. 4.71 కోట్లతో టెండర్లు ఖరారు చేసినట్లు ప్రకటించారు. శ్రీ లక్ష్మీ శ్రీనివాస మ్యాన్ పవర్ కార్పొరేషన్ లో పని చేస్తున్న సిబ్బందికి, వారి కుటుంబ సభ్యులతో కలిపి దర్శన వసతి, రాయితీపై రూ 20 చొప్పున నెలకు 10 లడ్డూలు అందించేందుకు నిర్ణయం తీసుకున్నట్లుగా ఛైర్మన్ సుబ్బారెడ్డి స్పష్టం చేసారు.












Click it and Unblock the Notifications