తిరుమలలో శ్రీరామ పట్టాభిషేకం - బ్రేక్ దర్శనాలపై కీలక నిర్ణయం..!!
31న రాత్రి శ్రీరామ పట్టాభిషేకే మహోత్సవం నిర్వహణకు టీటీడీ నిర్ణయించింది. ఇదే సమయంలో వీఐపీ బ్రేక్ దర్శనాలు..సేవల విషయంలోనూ కీలక నిర్ణయం తీసుకుంది.
Tirumala: తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉగాది..శ్రీరామ నవమి వేడుకలకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. 22న ఉగాది..ఈ నెల 30న తిరుమలలో శ్రీరామ నవమి ఉత్సవం నిర్వహించనున్నారు. 31న రాత్రి శ్రీరామ పట్టాభిషేకే మహోత్సవం నిర్వహణకు టీటీడీ నిర్ణయించింది. ఇదే సమయంలో వీఐపీ బ్రేక్ దర్శనాలు..సేవల విషయంలోనూ కీలక నిర్ణయం తీసుకుంది. టీటీడీ ఆధ్వర్యంలోని ఒంటిమిట్టలోనూ ఈ నెల 30వ తేదీ నుంచి శ్రీరామనవమి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు నిర్ణయించింది. ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలను నిర్వహించనుంది.

తిరుమలలో ఉగాది ఆస్థానం..
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో ఈ నెల 22న శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది ఆస్థానం శాస్త్రోక్తంగా నిర్వహించాలని టీటీడీ నిర్ణయించింది. ప్రతీ ఏటా ఉగాది నాడు తిరుమలలో ఆస్థానం నిర్వహిస్తారు. ఈ ఏడాది 22వ తేదీన ఉగాది రోజున సుప్రభాత సేవ అనంతరం ఆలయాన్ని శుద్ది చేయనున్నారు. ఉదయం 6 గంటలకు భూదేవి శ్రీదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారికి మరియు విష్వక్సేనుల వారికి విశేష సమర్పణ ఉంటుంది. ఉదయం 7 నుండి 9 గంటల మధ్య సమయంలో విమాన ప్రాకారం, ధ్వజస్తంభం చుట్టూ ఊరేగింపుగా ఆలయంలోనికి ప్రవేశిస్తారని టీటీడీ అధికారులు వివరించారు. ఆ తరువాత శ్రీవారి మూలవిరాట్టుతో పాటుగా ఉత్సవమూర్తులకు నూతన వస్త్రాలను అలంకరిస్తారు. అనంతరం పంచాగ శ్రవణం నిర్వహిస్తారు. ఉగాది ఆస్థానాన్ని బంగారు వాకిలి వద్ద ఆగమ పండితులు, అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు.

31న శ్రీరామ పట్టాభిషేకం
ఈ నెల 30, 31 తేదీల్లో తిరుమల శ్రీవారి ఆలయంలో శ్రీరామ నవమి, శ్రీరామ పట్టాభిషేకం నిర్వహించాలని నిర్ణయించారు. 30న ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు రంగనాయకుల మండపంలో శ్రీరామ చంద్రమూర్తి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. సాయంత్రం 6.30 నుంచి రాత్రి 8 గంటల వరకు హనుమంత వాహనసేవ జరుగుతంది. రాత్రి 9 నుంచి 10 గంటల నడుమ బంగారు వాకిలి చెంత శ్రీరామనవమి ఆస్థానం నిర్వహిస్తారు. 31న రాత్రి 8 నుంచి 9 గంటల నడుమ బంగారువాకిలి చెంత ఆలయ అర్చకులు శ్రీరామ పట్టాభిషేక మహోత్సవం నిర్వహిస్తారు. శ్రీరామనవమి ఉత్సవాల వేళ సహస్ర దీపాలకంరణ సేవను టీటీడీ రద్దు చేసింది. అదే విధంగా ఉగాది వేళ సేవలు..బ్రేక్ దర్శనాలకు సంబంధించి టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది.

రెండు రోజులు బ్రేక్ దర్శనాలు రద్దు
ఇదే సమయంలో ఉగాది ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని మార్చి 22వ తేదీన శ్రీవారి ఆలయంలో నిర్వహించే ఆర్జితసేవలైన కళ్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవంలను టిటిడి రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇదే సమయంలో టీటీడీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. సేవలతో పాటుగా రెండు రోజులు బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది.తిరుమల శ్రీవారి ఆలయంలో మార్చి 21న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, మార్చి 22న ఉగాది ఆస్థానం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా మార్చి 21, 22వ తేదీల్లో విఐపి బ్రేక్ దర్శనాలను టిటిడి రద్ధు చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో, మార్చి 20, 21వ తేదీల్లో విఐపి బ్రేక్ దర్శనాలకు ఎలాంటి సిఫార్సు లేఖలు స్వీకరించరని స్పష్టం చేసారు. భక్తులు టీటీడీ తీసుకున్న నిర్ణయం మేరక సహకరించాలని అధికారులు కోరుతున్నారు.












Click it and Unblock the Notifications