స్వర్ణరథంపై ఊరేగిన అమ్మవారు- తిరుపతిలో కనుల పండువగా..!!
తిరుపతి: నేడు వరలక్ష్మీ వ్రతం. ప్రతి శ్రావణ మాసంలో రెండో శుక్రవారాన్ని వరలక్ష్మీ వ్రతాన్ని జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. అమ్మవారిని అత్యంత భక్తి శ్రద్ధలతో కొలిచే సందర్భం ఇది. లక్ష్మీ దేవి, పద్మావతి, కనకదుర్గమ్మ.. ఇలా వేర్వేరు రూపాల్లో అమ్మవారిని పూజిస్తారు. నిండు కలశాలతో ఆరాధిస్తారు.
ఈ పండగను పురస్కరించుకుని తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వరలక్ష్మీ వ్రతాన్ని నిర్వహించింది టీటీడీ. తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి ఆలయ ఆస్థాన మండపంలో వరలక్ష్మీ వ్రతం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా వేకువ జామున అమ్మవారిని సుప్రభాతంతో మేల్కొలిపారు. సహస్రనామార్చన, నిత్యార్చన, మూలవర్లకు, ఉత్సవర్లకు అభిషేకం నిర్వహించారు.

ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని పద్మావతి అమ్మవారు బంగారుచీరతో విశేష అలంకరణలో భక్తులకు దర్శనం ఇచ్చారు. అనంతరం అమ్మవారి ఉత్సవమూర్తిని ఆస్థాన మండపానికి వేంచేపు చేసి పద్మపీఠంపై ఆశీనులను చేశారు. అక్కడ విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం, కలశస్థాపన, అమ్మవారి ఆరాధన, అంగపూజ, లక్ష్మీ సహస్రనామార్చన, అష్టోతర శత నామావళి నిర్వహించారు.
అమ్మవారిని రోజా, చామంతి, మల్లె, సంపంగి, తులసి, పన్నీరు ఆకు, మరువము, తామరపూలు, వృక్షి వంటి పుష్పాలతో అమ్మవారిని ఆరాధించారు. 9 గ్రంథులతో అలంకరించారు. ఒక్కో గ్రంథిని ఒక్కో దేవతకు గుర్తుగా ఆరాధించారు. భవిష్యోత్తర పురాణంలో వ్యాస భగవానుడు వరలక్ష్మీ వ్రతం పూజావిధానాన్ని, మహత్యాన్ని తెలియజేశారని పాంచరాత్ర ఆలయ అర్చకులు శ్రీనివాసన్ తెలిపారు. వ్రత కథలను చదివి వినిపించారు.
అనంతరం 12 రకాల నైవేద్యాలను అమ్మవారికి మహా నివేదనాన్ని సమర్పించారు. మహా మంగళ హరతితో వరలక్ష్మీ వ్రతం ముగిసింది.
భక్తులందరూ వ్రతాన్ని వీక్షించేందుకు వీలుగా ఆస్థాన మండపం, పుష్కరిణి, గంగుండ్ర మండపం వద్ద నాలుగు ఎల్ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేశారు టీటీడీ అధికారులు.
ఈ కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ శ్రీ భూమన కరుణాకర్ రెడ్డి దంపతులు, జేఈవోలు సదా భార్గవి, వీరబ్రహ్మం దంపతులు, తిరుపతి మున్సిపల్ కమిషనర్ హరిత, ఎస్వీబీసీ సీఈవో షణ్ముఖ కుమార్ పాల్గొన్నారు. సాయంత్రం పద్మావతి అమ్మవారు తిరుచానూరు నాలుగు మాడ వీధుల్లో స్వర్ణ రథంపై విహరించారు. భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేశారు.












Click it and Unblock the Notifications