ఢిల్లీని దాటేసిన ఏపీ: మూడోరోజూ 10వేలు దాటిన కరోనా కేసులు, 68 మరణాలు, జిల్లాల వారీగా
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు రోజు రోజుకు మరింతగా పెరిగిపోతున్నాయి. వరుసగా మూడో రోజు కూడా 10వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడం గమనార్హం. రాష్ట్రంలో కరోనా పరీక్షలు పెంచుతున్న కొద్దీ కరోనా కేసులు కూడా పెరుగుతుండటం ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది.

మూడో రోజూ 10వేలు దాటిన కేసులు..
తాజాగా, గత 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 10,376 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,40,933కి చేరింది. గత 24 గంటల్లో 61,699 పరీక్షలు నిర్వహించగా, ఇప్పటి వరకు నిర్వహించిన మొత్తం పరీక్షల సంఖ్య 19,51,776 పరీక్షలు చేశారు.

68 మంది మృతి.. జిల్లాల వారీగా..
ప్రస్తుతం రాష్ట్రంలో 75,720 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు 63,864 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. తాజాగా కరోనాతో రాష్ట్రంలో 68 మంది చెందారు. గుంటూరు జిల్లాలో 13 మంది, అనంతపురంలో 9 మంది, కర్నూలు జిల్లాలో 8మంది, చిత్తూరు, తూర్పుగోదావరి జిల్లాల్లో ఏడుగురు చొప్పున, పశ్చిమగోదావరి జిల్లాలో ఇద్దరు, కడప, కృష్ణా, విజయనగరం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారు. తాజాగా నమోదైన 68 మరణాలతో మొత్తం మరణాలు సంఖ్య 1349కి చేరింది.

జిల్లాల వారీగా కరోనా పాజిటివ్ కేసులు..
తాజా నమోదైన కరోనా కేసుల్లో అత్యధికంగా అనంతపురంలో ఉన్నాయి. జిల్లాల వారీగా కేసులను గమనిస్తే.. అనంతపురంలో 1387, చిత్తూరులో 789, తూర్పుగోదావరిలో 1215, గుంటూరులో 906, కడపలో 646, కృష్ణా 313, కర్నూలులో 1124, నెల్లూరులో 861, ప్రకాశంలో 406, శ్రీకాకుళంలో 402, విశాఖపట్నంలో 983, విజయనగరంలో 388, పశ్చిమగోదావరిలో 956 కరోనా కేసులు నమోదయ్యాయి.
Recommended Video

ఢిల్లీని దాటేసిన ఏపీ... మూడోస్థానంలోకి..
తాజాగా నమోదైన కరోనా పాజిటివ్ కేసులతో దేశ వ్యాప్తంగా అత్యధికంగా కేసులు నమోదైన రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్ మూడో స్థానానికి ఎగబాకింది. మూడో స్థానంలో ఉన్న ఢిల్లీ నాలుగో స్థానానికి పడిపోయింది. ఢిల్లీలో లక్షా 35వేల కరోనా కేసులున్నాయి. ఇక దేశ వ్యాప్తంగా 16,62,685 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 5,57,168 యాక్టివ్ కేసులున్నాయి. 10,69,126 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 35,968 మంది కరోనా బారినపడి మరణించారు.












Click it and Unblock the Notifications