సీబీఐ రీఎంట్రీ: ఆయేషా మీరా మృతదేహానికి రీపోస్ట్ మార్టమ్: దిశ చట్టం కిందికి.. !
విజయవాడ: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఆయేషా మీరా అత్యాచారం, హత్యోదంతం మరోసారి తెర మీదికి వచ్చింది. ఈ కేసు ద్వారా సీబీఐ రాష్ట్ర కార్యకలాపాల్లో పునఃప్రవేశం చేయనుంది. ఆయేషా మీరా మృతదేహానికి రీ పోస్ట్ మార్టమ్ నిర్వహించాలని సీబీఐ నిర్ణయించింది. ఈ నెలలోనే పోస్ట్ మార్టమ్ ప్రక్రియను పూర్తి చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి అవసరమైన ఏర్పాట్లు చేయాలంటూ పోలీసులను కోరినట్లు చెబుతున్నారు. ఎముకల మూలిగలను సేకరిస్తారని అంటున్నారు.

రాజకీయ కోణాల్లో నలిగిన కేసు..
12 సంవత్సరాల కిందటి కేసు ఇది. 2007 డిసెంబర్ లో కృష్ణాజిల్లా ఇబ్రహీంపట్నంలోని ఓ ప్రైవేటు కళాశాల వపతిగృహంలో ఆయేషా మీరా దారుణంగా హత్యకు గురైన విషయం తెలిసిందే. హత్య చేయడానికి ముందు ఆమెపై అత్యాచారం చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ కేసులో రాజకీయ నాయకుల ప్రమేయం ఉన్నట్లు అప్పట్లో వార్తలు వెలువడ్డాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా సత్యంబాబు అనే యువకుడిని గుర్తించారు. అతనికి జైలు శిక్ష విధించారు. ఈ కేసులో అతణ్ని న్యాయస్థానం నిర్దోషిగా గుర్తించింది.

సత్యంబాబు విడుదలతో మళ్లీ మొదటికి..
దీనితో ఈ కేసు మళ్లీ మొదటికి వచ్చింది. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తును సీబీఐ చేపట్టింది. నిజానికి- ఆరునెలల కిందటే ఆయేషా మీరా మృతదేహానికి రీపోస్ట్ మార్టమ్ నిర్వహించాలని సీబీఐ నిర్ణయించుకున్నప్పటికీ.. అది సాధ్యపడలేదు. సీబీఐని నిషేధిస్తూ గతంలో చంద్రబాబు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం వల్ల ఈ జాప్యం చోటు చేసుకున్నట్లు చెబుతున్నారు. తాజాగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో ఏర్పడిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ నిషేధాన్ని ఎత్తేయడంతో కేసు మళ్లీ ముందుకు సాగనుంది.

సీబీఐపై నిషేధం ఎత్తేయడంతో..
ఆయేషా మీరా అత్యాచారం, హత్య కేసులో పునర్విచారణను వేగవంతం చేయాలని సీబీఐ నిర్ణయించుకుంది. ఈ నేపథ్యంలో- ఈ నెలలోనే ఆయేషా మీరా మృతదేహానికి రీ పోస్ట్ మార్టమ్ నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో ఇప్పటికే 12 సంవత్సరాల పాటు జాప్యం చోటు చేసుకోవడం.. ప్రధాన నిందితుడిగా గుర్తించిన సత్యంబాబు నిర్దోషిగా విడుదల కావడం వంటి కారణాల వల్ల సీబీఐ ఈ కేసును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నట్లు చెబుతున్నారు.

దిశ చట్టం కిందికి..
రాష్ట్రంలో కొత్తగా దిశ చట్టాన్ని తీసుకొచ్చిన నేపథ్యంలో.. ఈ కేసును పునర్విచారణ చేపట్టడం ఆసక్తికరంగా మారింది. ఆయేషా మీరా కేసును దిశ చట్టం కిందికి తీసుకొస్తారా? లేదా? అనేది చర్చనీయాంశమౌతోంది. మహిళలకు భద్రత కల్పించడానికి అత్యంత కఠినమైన, కీలకమైన నిర్ణయాలను వైఎస్ జగన్ ప్రభుత్వం తీసుకున్న నేపథ్యంలో.. ఆయేషా మీరా కేసులో పునర్విచారణ చేపట్టనుండటంతో ఈ కేసు చివరికి ఎలాంటి మలుపును తీసుకుంటుదనేది ఉత్కంఠతను రేపుతోంది.












Click it and Unblock the Notifications