జగన్ సర్కార్‌పై హైకోర్టు సీరియస్- ఉపాధి బిల్లులు చెల్లించరా ? సీఎస్‌ను పిలిపిస్తామంటూ
ఏపీలో రాజకీయ కారణాలతో రెండేళ్లుగా ఉపాధి హామీ బిల్లులు చెల్లించకుండా ఆపుతున్న వైసీపీ సర్కారుపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన పనులకు తాము బిల్లులు చెల్లించబోమంటూ గతంలో మంత్రులే బహిరంగంగా వ్యాఖ్యలు చేయగా.. అధికారులు కూడా ప్రభుత్వం చెప్పినట్లుగానే బిల్లులు చెల్లించకుండా నిలిపేశారు. దీనిపై టీడీపీ నేతలు ఎన్ని ఫిర్యాదులు చేసినా, విజ్ఞప్తులు చేసినా ప్రభుత్వం పట్టించుకోలేదు. చివరికి హైకోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాలను కూడా పాటించకపోవడంతో ఇవాళ సీరియస్ అయింది.

ఉపాధి హామీ బిల్లులకు రాజకీయ గ్రహణం
దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కూలీలకు ఉపాధి హామీ అందిస్తూ గతంలో యూపీఏ సర్కారు మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చింది. దీని ప్రకారం ఏటా నిర్ధిష్ట పని దినాలను కల్పిస్తూ ప్రభుత్వం చేపట్టే పలు అభివృద్ధి కార్యక్రమాల్లో కూలీలను వాడుకుని కేంద్రం ఇచ్చే నిధులను వీరికి బిల్లుల రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. కానీ దీనికి కూడా ఏపీలో రాజకీయ గ్రహణం పట్టింది. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన పనులకు తామెందుకు బిల్లులు చెల్లించాలంటూ వైసీపీ సర్కారు మొండికేసింది. దీంతో అప్పటి బిల్లులకు ఇప్పటికీ మోక్షం లభించడం లేదు.

జగన్ సర్కార్‌పై హైకోర్టు ఆగ్రహం
రాష్ట్రంలో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన ఉపాధి హామీ పనులకు బిల్లులు చెల్లించని ప్రభుత్వం.. రెండేళ్ల క్రితం తాము అధికారంలోకి వచ్చాక చేస్తున్న పనులకు మాత్రం బిల్లులు చెల్లిస్తోంది. దీంతో ఈ వ్యవహారంపై దాఖలైన పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. మొత్తం ఏడు లక్షల పనులకు బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని పిటిషనర్ తరఫు న్యాయవాది హైకోర్టు దృష్టికి తెచ్చారు. దీంతో పాటు ప్రభుత్వం ఉపాధి హామీ బిల్లులకు చెల్లించాల్సిన మొత్తాలను దారి మళ్లించి ఇతర పథకాలకు వాడుకుంటోందని ఆరోపించారు. ఉపాధి హామీ బిల్లులు ఎందుకు చెల్లించలేదని హైకోర్టు అడిగిన ప్రశ్నకు కేంద్రం నుంచి నిధులు రాలేదంటూ జవాబిచ్చిన ప్రభుత్వం... ఆ తర్వాత జరిగిన బిల్లులు ఎలా చెల్లించారంటూ అడిగిన ప్రశ్నకు తెల్లమొహం వేయాల్సి వచ్చింది. అంతే కాదు గతంలో ఐదు లక్షల బిల్లులను 20 శాతం మొత్తం తగ్గించి చెల్లిస్తామంటూ హైకోర్టుకు ఇచ్చిన హా్మీ ఎందుకు అమలు కాలేదంటూ నిలదీసింది.

సరైన సమాధానం రాకపోతే హైకోర్టుకు సీఎస్
ఏపీలో 2018 నుంచి 2019 వరకూ జరిగిన ఉపాధి హామీ పనులు, వాటి బిల్లుల చెల్లింపులపై సమగ్రంగా అఫిడివిట్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. గతంలో హైకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్‌ను ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించిన హైకోర్టు.. తాజా వివరాలతో రెండు వారాల్లో పూర్తి స్ధాయిలో అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశాలు ఇచ్చింది. ఇందులో సరైన సమాధానం రాకపోతే మాత్రం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్‌ను హైకోర్టుకు పిలిపిస్తామని హెచ్చరించింది.












Click it and Unblock the Notifications