రాష్ట్ర ఆదాయానికి గండి పడుతోంది: వైఎస్ జగన్‌కు లారీ ఓనర్ల అసోసియేషన్ లేఖ
విజయవాడ: దేశవ్యాప్తంగా కొన్ని నెలల పాటు భారీగా పెరుగుతూ వచ్చిన పెట్రోల్, డీజిల్ రేట్లు ఒక్కసారిగా తగ్గాయి. దీపావళి పండగను పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం ఇంధనంపై ఎక్సైజ్ డ్యూటీని తగ్గించింది. పెట్రోల్‌పై అయిదు రూపాయలు, డీజిల్‌పై 10 రూపాయల మేర ఈ సుంకాన్ని తగ్గించింది. ఫలితంగా- వాటి రేట్లు దేశవ్యాప్తంగా 100 రూపాయలకు పడిపోయింది. వాహనదారులకు కొంత మేర ఊరట కలిగించింది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని పలు రాష్ట్రాలు అనుసరించాయి. తాము కూడా ఇంధన అమ్మకాలపై విధించిన వ్యాట్, సేల్స్ ట్యాక్స్‌ను కొంతమేర తగ్గించాయి.

ఆసక్తి చూపని రాష్ట్రాలు..
అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్, అమ్మకం పన్నును తగ్గించలేదు. భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాలు వ్యాట్, సేల్స్ ట్యాక్స్‌ను కొంతమేర తగ్గించాయి. ఒక్కో రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో రకంగా వ్యాట్‌ను తగ్గించింది. బీజేపీయేతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాట్ తగ్గించడానికి ఆసక్తి చూపట్లేదు. ఖజానాకు వచ్చే రోజువారీ ఆదాయం తగ్గుతుందనేది ప్రధాన కారణం. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ డ్యూటీని తగ్గించింది. దీనికి అదనంగా వ్యాట్ తగ్గించాలనే డిమాండ్ క్రమంగా ఊపందుకుంటోంది ఆయా రాష్ట్రాల్లో.

తగ్గింపు కోసం..
రాజస్థాన్, పంజాబ్, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, జార్ఖండ్, తమిళనాడు, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్, కేరళ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, అండమాన్ అండ్ నికోబార్‌లల్లో వ్యాట్‌ను తగ్గించడానికి అక్కడి ప్రభుత్వాలు సుముఖంగా లేవు. దీనిపట్ల బీజేపీ అసంతృప్తిని వ్యక్తం చేస్తోంది. వ్యాట్‌ను తగ్గించాలంటూ డిమాండ్ చేస్తోంది. ఏపీ, తెలంగాణల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. వ్యాట్‌ను తగ్గించాలంటూ గురువారం తెలుగుదేశం పార్టీ కూడా రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలను నిర్వహించనుంది

ఏపీ లారీ ఓనర్ల అసోసియేషన్ లేఖ..
ఈ పరిణామాల మధ్య ఏపీ లారీ ఓనర్ల అసోసియేషన్.. వైఎస్ జగన్‌కు లేఖ రాసింది. అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ రేటు తక్కువగా ఉన్న సమయంలో కూడా కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను భారీగా పెంచిందని గుర్తు చేసింది. దీపావళి పండగను పురస్కరించుకుని కేంద్రం పెట్రోల్‌పై అయిదు రూపాయలు, డీజిల్‌పై 10 రూపాయల మేర ఎక్సైజ్ డ్యూటీని తగ్గించిందని, దానికి అనుగుణంగా అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు వాటి రేట్లను తగ్గించాలని సూచించిందని పేర్కొంది.

డీజిల్‌పై 22 శాతం వ్యాట్..
ఏపీలో డీజిల్‌పై వ్యాట్ 22.25 శాతంగా ఉంటోందని, దీన్ని 17కు తగ్గించాలని అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి వైవీ ఈశ్వర రావు విజ్ఞప్తి చేశారు. పెట్రోల్‌పై వ్యాట్ 33 నుంచి 28 శాతానికి, ఇంధన విక్రయాలపై అదనంగా విధించిన నాలుగు రూపాయల పన్నును సగానికి తగ్గించాలని కోరారు. దీనివల్ల వాహనదారులకు మాత్రమే కాకుండా.. రవాణా రంగానికి ఊరట కలిగించినట్టవుతుందని చెప్పారు. పొరుగు రాష్ట్రాలతో పోల్చుకుంటే ఏపీలో డీజిల్ రేటు అధికంగా ఉంటోందని గుర్తు చేశారు.
Recommended Video

పొరుగు రాష్ట్రాల్లో డీజిల్ కొనుగోలు
ఫలితంగా- నేషనల్ పర్మిట్ ఉన్న లారీలు, ఇతర వాహనాలు పొరుగు రాష్ట్రాల్లోనే డీజిల్‌ను కొంటున్నాయని ఆయన ఈ లేఖలో పొందుపరిచారు. ఫలితంగా- డీజిల్ అమ్మకాలపై వచ్చే ఆదాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోల్పోతోందని పేర్కొన్నారు. ఏపీలోనూ డీజిల్ ధర తక్కువగా ఉంటే.. ఏపీ మీదుగా రాకపోకలు సాగించే ఇతర రాష్ట్రాలకు చెందిన లారీలు కూడా ఇక్కడే డీజిల్‌ను కొనుగోలు చేస్తాయని, ఫలితంగా ఆదాయం తగ్గదని సూచించారు. ఈ పరిణామాలన్నింటినీ దృష్టిలో ఉంచుకుని తాము చేసిన విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించాలని అన్నారు. పెట్రోల్, డీజిల్ అమ్మకాలపై వ్యాట్‌ను తగ్గించాలని కోరారు.












Click it and Unblock the Notifications