విజయవాడలో భారీగా ట్రాఫిక్ ఆంక్షలు- అటు వెళ్లొద్దు
Chandrababu Naidu: ముఖ్యమంత్రిగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడి ప్రమాణ స్వీకార ఏర్పాట్లు.. విజయవాడలో చురుగ్గా సాగుతున్నాయి. గన్నవరం సమీపంలోని కేసరాపల్లి ఐటీ పార్క్ వద్ద ఈ కార్యక్రమం ఏర్పాటు కానుంది. గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్.. ఆయనతో ప్రమాణ స్వీకారం చేయిస్తారు.
ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయబోతోండటం ఇది రెండోసారి. మొత్తంగా నాలుగోసారి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రెండుసార్లు, రాష్ట్ర విభజన అనంతరం తొలిసారిగా 2014లో ప్రమాణ స్వీకారం చేశారాయన. ఇప్పుడు మళ్లీ ఈ పదవిని అందుకోబోనున్నారు.

ప్రమాణ స్వీకారం కోసం కేసరాపల్లి ఐటీ పార్క్ వద్ద గల ఖాళీ స్థలాన్ని ఎంచుకున్నారు. ప్రస్తుతం అక్కడ పనులు చురుగ్గా సాగుతున్నాయి. వేదిక నిర్మాణ సామాగ్రి ఇప్పటికే ఆ ప్రదేశానికి చేరుకుంది. వేదిక నిర్మాణ పనులు దాదాపుగా పూర్తి కావొస్తోన్నాయి. ప్రమాణ స్వీకార ఏర్పాటు పనులను ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్, పోలీస్ సూపరింటెండెంట్.. పరిశీలించారు.
ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి. కేంద్ర మంత్రులు హెచ్ డీ కుమారస్వామి, కింజరాపు రామ్మోహన్ నాయుడు, డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, భూపతిరాజు శ్రీనివాసవర్మ, రేవంత్ రెడ్డి సహా కొందరు ముఖ్యమంత్రులు ఇందులో పాల్గొననున్నారు.
ఈ సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా పోలీసులు పెద్ద ఎత్తున ట్రాఫిక్ ఆంక్షలను విధించారు. విమానాశ్రయానికి వెళ్లే వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కేసరాపల్లి ఐటీ పార్క్, గన్నవరం పరిసరాల్లో పలు మార్గాల్లో వాహనాలను మళ్లించారు.
చెన్నై నుంచి విశాఖపట్నం వైపు వెళ్లే వాహనాలను ఒంగోలు వద్ద దారి మళ్లించారు. ఒంగోలు నుంచి రేపల్లె మీదుగా మచిలీపట్నం- లోసర్ బ్రిడ్జి నరసాపురం- అమలాపురం- కాకినాడ- కత్తిపూడి మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. ప్రత్యామ్నాయంగా బుడంపాడు నుంచి తెనాలి- పులిగడ్డ- మచిలీపట్నం- లోసర్ బ్రిడ్జి- నర్సాపురం- కాకినాడ- కత్తిపూడి వైపు మళ్లించారు.
విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వైపు వెళ్లే వాహనాలను గ్యామన్ బ్రిడ్జి- దేవరాపల్లి- జంగారెడ్డిగూడెం- అశ్వారావుపేట- ఖమ్మం మీదుగా మళ్లించారు. ప్రత్యామ్నాయంగా భీమడోలు- ద్వారకా తిరుమల- కామవరపుకోట- చింతలపూడి నుంచి ఖమ్మం లేదా ఏలూరు బైపాస్ నుంచి జంగారెడ్డిగూడెం మీదుగా అశ్వారావుపేట, ఖమ్మం మీదుగా హైదరాబాద్ వైపు వెళ్లొచ్చు.
ఏలూరు బైపాస్ - చింతలపూడి నుండి సత్తుపల్లి మీదుగా ఖమ్మం, హైదరాబాద్ లేదా హనుమాన్ జంక్షన్- నూజివీడు- మైలవరం- ఇబ్రహీంపట్నం- నందిగామ మీదుగా హైదరాబాద్ వైపు మళ్లింపు వెళ్లొచ్చు.
హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వైపు వెళ్లే వాహనాలను నందిగామ- మధిర- వైరా- సత్తుపల్లి- అశ్వారావుపేట- జంగారెడ్డిగూడెం- దేవరాపల్లి- గ్యామన్ బ్రిడ్జి మీదుగా మళ్లించారు. అలాగే.. ఇబ్రహీంపట్నం- మైలవరం- నూజివీడు- హనుమాన్ జంక్షన్ నుంచి ఏలూరు బైపాస్ మీదుగా వైజాగ్ వెళ్లొచ్చు.
ప్రత్యామ్నాయంగా రామవరప్పాడు- నున్న- పాముల కాలువ- వెలగలేరు- జీ కొండూరు- మైలవరం- నూజివీడు- హనుమాన్ జంక్షన్- ఏలూరు బైపాస్ మీదుగా లేదా విజయవాడ నుంచి ఎనికేపాడు-100 ఫీట్ రోడ్డు- తాడిగడప- కంకిపాడు- పామర్రు- గుడివాడ నుంచి భీమవరం మీదుగా విశాఖపట్నం వెళ్లొచ్చు.












Click it and Unblock the Notifications