సీఎం జగన్ యజ్ఞ సంకల్పం - ఆరు రోజుల పాటు ఇలా..!!
ఏపీ దేవాదాయ శాఖ మహాయజ్ఞానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రం సస్యశ్యామలంగా అభివృద్ధి చెందుతూ ప్రజలందరూ కల్యాణ సౌభాగ్యాలతో వర్థిల్లాలని కాంక్షిస్తూ విజయవాడలో ఈ యజ్ఞం ప్రారంభమైంది. మే 17వ తేదీ బుధవారం వరకు 6 రోజులపాటు ఈ మహాయజ్ఞం కొనసాగనుంది. ముఖ్యమంత్రి జగన్ సంకల్పం తీసుకున్న అనంతరం మహాయజ్ఞం ప్రారంభమైంది. గోశాల వద్ద ప్రత్యేక పూజలు చేసిన సీఎం జగన్.. కపిల గోవుకు హారతి ఇచ్చారు. అనంతరం అఖండ దీపారాధనలో పాల్గొన్నారు.
ఈ రోజు ప్రారంభమై ఈ ఈ మహాయజ్ఞంలో భాగంగా అష్టోత్తర శత కుండాత్మక చండీ, రుద్ర, రాజశ్యామల, సుదర్శన సహిత శ్రీలక్ష్మీ మహాయజ్ఞం నిర్వహించనున్నారు. వైఖానసం, పాంచరాత్రం, శైవం, వైదిక స్మార్తం ఆగమాలతో ఏర్పాటు చేసిన నాలుగు ప్రధాన యాగశాలల్లో యజ్ఞాలు జరుగుతాయి. ఒక్కొక్క యాగశాలలో 27 కుండాల చొప్పున మొత్తం 108 కుండాలతో రుత్వికులు యజ్ఞ కార్యక్రమాలు నిర్వహిస్తారు. తొలి రోజు ఉదయం మినహా ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు.. సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల వరకు కొనసాగుతాయి. పవిత్ర సప్తనదీ, త్రి సముద్ర జలాలతో 1008 కలశాలతో విశేష అభిషేకాలు నిర్వహించనున్నట్టు దేవదాయ శాఖ వర్గాలు వెల్లడించాయి.

ఉదయం 5గంటలకు మహామంగళ వాయిద్య హృద్య నాదం, భగవత్ ప్రీతిగా వేదస్వస్తి, గోపూజ, విఘ్నేశ్వర-విష్వక్సేన పూజలు, పుణ్యాహవచనం, దీక్షాధారణ, అజస్ర దీపారాధన తదితర కార్యక్రమాలు మొదలయ్యాయి. పవిత్ర సప్తనదీ, త్రి సముద్ర జలాలతో 1008 కలశాలతో విశేష అభిషేకాలు నిర్వహించనున్నట్టు దేవదాయ శాఖ వర్గాలు వెల్లడించాయి. రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందాలని, ప్రజలకు శాంతి సౌభాగ్యాలు కలగాలని, పాడిపంటలు సమృద్ధిగా ఉండాలని ఈ మహాయజ్ఞం చేపట్టినట్టు దేవదాయ శాఖ పేర్కొంది. ఈ ఆరు రోజుల పాటు ఒక్కో రోజు ఒక పీఠాధిపతి సందర్శంచి అనుగ్రహ భాషణం చేయనున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు.












Click it and Unblock the Notifications