బెజవాడలో ఆగని గంజాయి బ్యాచ్ దాడులు-తాజాగా సింగ్ నగర్లో రోడ్డుపైనే..!
విజయవాడ నగరంలో గంజాయి బ్యాచ్ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. గంజాయితో పాటు బ్లేడ్ బ్యాచ్ రెచ్చిపోతున్నారు. వీరికి అడ్డుకట్ట వేసేందుకు పోలీసులు చేస్తున్న ప్రయత్నాలు నామమాత్రంగానే ఉంటున్నాయి. దీంతో వారి ఆగడాలకు అంతు లేకుండా పోతోంది. తాజాగా అజిత్ సింగ్ నగర్లో గంజాయి సేవించిన ఓ వ్యక్తి పాన్ షాప్ ఓనర్ ను బయటికి లాక్కొచ్చి చితకబాదాడు. రోడ్డుపై అందరూ చూస్తుండగానే ఈ ఘటన చోటు చేసుకుంది.
విజయవాడ నగరంలో గంజాయి, బ్లేడ్ బ్యాచ్ రెచ్చిపోతోంది. కొన్నేళ్లుగా ఎక్కడెక్కడి నుంచో వచ్చి నగరంలో పాతుకుపోయిన ఈ బ్యాచ్ లను ఆటకట్టిస్తామంటూ ఆర్భాటంగా ప్రకటనలు చేస్తున్న పోలీసులు వాస్తవంలో మాత్రం పట్టించుకున్న పాపాన పోవడం లేదు. ఒక వేళ పట్టుకుని కేసులు పెట్టినా జైలుకు వెళ్లి తిరిగి వచ్చి మళ్లీ దాడులకు పాల్పడుతున్నారు. దీంతో వీరిని ఎలా అరికట్టాలో తెలియక సతమతం అవుతున్నారు.

తాజాగా నగరంలోని అజిత్ సింగ్ నగర్ రూప లక్ష్మి సాయి బార్ అండ్ రెస్టారెంట్ వద్ద పొట్టకూటికోసం పాన్ షాప్ నిర్వహిస్తున్న విజయ్ కుమార్ అనే మాజీ వాలంటీర్ పై గంజాయి సేవించిన ఓ వ్యక్తి దాడికి పాల్పడ్డాడు. కృష్ణ హోటల్ సెంటర్ ప్రాంతానికి చెందిన గంజాయి బ్యాచ్ సభ్యుడు.. బార్ లో మద్యం సేవించి బయటికి వచ్చి సిగరెట్ ఇవ్వమని పాన్ షాప్ ఓనర్ విజయ్ కుమార్ ని డిమాండ్ చేశాడు. ఇచ్చాక డబ్బులు అడిగితే నన్నే డబ్బులు అడుగుతావా అంటూ చొక్కా పట్టుకొని షాపులోంచి బయటికి ఈడ్చుకువచ్చి మరీ దాడి చేశాడు. పోలీసులు తననేం చేయలేరంటూ మాజీ వాలంటీర్ పై పిడిగుద్దులతో దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన స్థానిక పీఎస్ కు దగ్గరే జరిగినా ఆపేందుకు ఎవరూ రాలేదు.












Click it and Unblock the Notifications