ప్రతిష్టాత్మక జిల్లాలో 11 మందిని ఖరారు చేసిన చంద్రబాబు
వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా విజయం సాధించి తీరాలనే లక్ష్యంతో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు వ్యూహాలు రచిస్తున్నారు. మరోవైపు అధికారంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కచ్చితంగా రెండోసారి అధికారంలోకి వస్తామనే లక్ష్యంతో పనిచేస్తోంది. వ్యూహ ప్రతివ్యూహాల్లో రెండు పార్టీలు హోరాహోరీగా తలపడుతున్నాయి.

అన్నివిధాలుగా ఎదుర్కోవడానికి సిద్ధమైన టీడీపీ
అధికార పార్టీ ఏ క్షణంలోనైనా ముందస్తుకు వెళ్లే అవకాశం ఉండటంతో చంద్రబాబునాయుడు అన్నివిధాలుగా వాటిని ఎదుర్కోవడానికి పార్టీ శ్రేణులను సిద్ధం చేస్తున్నారు. నియోజకవర్గాలవారీగా సమీక్షలు నిర్వహించడంతోపాటు ఎన్నడూ లేనివిధంగా అభ్యర్థులను ముందుగానే ఖరారు చేస్తున్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాపై దృష్టి సారించిన చంద్రబాబు మొత్తం 16 నియోజకవర్గాలకు గాను 11 నియోజకవర్గాల్లో అభ్యర్థులను ఖరారు చేశారు. రెండు నియోజకవర్గాలకు అభ్యర్థులు మాత్రం సస్పెన్స్ లో కొనసాగుతున్నారు.

అందరితో ముఖాముఖి మాట్లాడిన చంద్రబాబు
జిల్లాలోని రెండు లోక్ సభ నియోజకవర్గాల్లో విజయవాడ నుంచి కేశినేని శివనాథ్ (చిన్ని) ఖరారయ్యారు. మచిలీపట్నం నుంచి కొనకళ్ల నారాయణ పోటీకి విముఖత చూపారు. దీంతో మాజీ ఎంపీ బాడిగ రామకృష్ణ లేదంటే ఆయన కుమార్తె కానీ పోటీచేసే అవకాశాలున్నాయి. అభ్యర్థులను ఖరారు చేసేముందు పలురకాలుగా సర్వే చేయించుకున్న బాబు అందరితో ముఖాముఖి మాట్లాడారు.

గన్నవరం నుంచి గద్దే అనురాధ
మైలవరం నుంచి దేవినేని ఉమ, జగ్గయ్యపేట నుంచి శ్రీరామ్ తాతయ్య, నందిగామ నుంచి తంగిరాల సౌమ్య, తిరువూరు నుంచి ఉప్పులేటి కల్పన లేదంటే వాసం మునయ్య, విజయవాడ సెంట్రల్ నుంచి బొండా ఉమ, విజయవాడ తూర్పు నుంచి గద్దే రామ్మోహన్, విజయవాడ పశ్చిమ నుంచి కేశినేని నాని, గన్నవరం నుంచి గద్దే అనురాధ, పెడన నుంచి కొనకళ్ల నారాయణ, పెనమలూరు నుంచి బోడే ప్రసాద్, పామర్రు నుంచి వర్ల కుమార్ రాజా పేర్లు ఖరారయ్యాయి. టీడీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న గుడివాడ నియోజకవర్గంలో ప్రస్తుతం రావి వెంకటేశ్వరరావు పనిచేస్తున్నారు. ఆయనకే సీటు ఖరారవుతుందా? లేదంటే ఎవరైనా కొత్త అభ్యర్థి వస్తారా? అనే విషయంలో స్పష్టత రాలేదు.












Click it and Unblock the Notifications