తిరుమల వెంకన్న బాటలో బెజవాడ దుర్గమ్మ: తొలిసారి బ్రేక్ దర్శనాలు, సంప్రదాయ దుస్తుల్లోనే దర్శనం
విజయవాడ కనకదుర్గమ్మ దేవస్ధానం దర్శనాలతో పాటు అన్ని వ్యవహారాల్లో సమూల మార్పులు చేయాలని పాలక మండలి నిర్ణయించింది. టీటీడీ తరహాలో దుర్గమ్మకు కొత్తగా బ్రేక్ దర్శనాన్ని ఏర్పాటు చేయనుంది. దీంతో పాటు డోనర్స్ సెల్ ఏర్పాటు, సంప్రదాయ దుస్తుల్లోనే దుర్గమ్మ దర్శనానికి అనుమతి ఇవ్వాలని పాలకమండలి నిర్ణయించింది.

ఇక బెజవాడ దుర్గమ్మకూ బ్రేక్ దర్శనం
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏర్పాటు చేసిన బెజవాడ కనకదుర్గమ్మ దేవస్ధానం నూతన పాలకమండలి ఛైర్మన్ పైలా సోమినాయుడు అధ్యక్షతన ఇవాళ విజయవాడలో సమావేశమైంది. ఇందులో మొత్తం పది అంశాలపై చర్చించారు. అనంతరం పలు కీలక నిర్ణయాలను తీసుకున్నారు. వీటి ప్రకారం ఇకపై తిరుమల తరహాలో దుర్గమ్మకూ బ్రేక్ దర్శనాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఆలయ అభివృద్దితో పాటు అమ్మవారి మూలదనం కాపాడే విధంగా పాలన చేయబోతున్నట్లు సమావేశం ముగిశాక ఛైర్మన్ సోమినాయుడు తెలిపారు. టీటీడీ తరహాలో బ్రేక్ దర్శనం ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నట్లు పాలక మండలి సభ్యుడు, ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి తెలిపారు.

దుర్గమ్మ గుడికి కొత్త మాస్టర్ ప్లాన్
అమ్మవారి దేవాలయానికి నూతన మాస్టర్ ప్లాన్ తీసుకురావాలని పాలక మండలి తీర్మానించింది. దీంతో పాటు తిరుమల తరహాలోనే కొత్తగా డోనర్స్ సెల్ ఏర్పాటు చేయబోతున్నారు. ఆలయ పవిత్రత, పరిశుభ్రతను కచ్చితంగా అమలు చేయాలని నిర్ణయించారు. అమ్మవారి సేవలను భక్తులకు వ్యాపారమయం చేయరాదని మండలి తీర్మానించింది. అలాగే ఆలయంలో అవినీతికి తావులేకుండా చూడాలని నిర్ణయించారు.

టీడీపీ పాలనలో అక్రమాలపై విచారణ
గత ఐదేళ్లలో టీడీపీ హయాంలో దేవస్ధానంలో చోటుచేసుకున్న పలు ఘటనలపై పాలక మండలి ప్రత్యేకంగా చర్చించింది. ప్రతీరోజూ అమ్మవారి సేవలో భక్తులను భాగస్వాములను చేయాలని నిర్ణయించిన పాలక మండలి.. గత పాలకమండలి అక్రమాలు, చీరల దొంగతనాలు ,క్షుద్రపూజలపై చర్యల కోసం ప్రత్యేకంగా సమావేశం కావాలని నిర్ణయించింది. ఈ ఏడాది నుండి దసరా ఉత్సవాల ఖర్చుని భరించేలా ప్రభుత్వాన్ని ఒప్పించాలని నిర్ణయించారు.

ఇక సంప్రదాయ దుస్తుల్లోనే దర్శనానికి అనుమతి
ఈ ఉగాది నుంచి అమ్మవారి అంతరాలయ దర్శనం చేసుకొనే ప్రతీ భక్తుడు సాంప్రదాయ దుస్తుల్లోనే వచ్చేలా చర్యలు తీసుకోవాలని పాలక మండలి తీర్మానించింది. దీని ప్రకారం మగభక్తులు పంచె, కండువా, మహిళా భక్తులుచీరల్లోనే రావాలని నిబంధనలు విధించనున్నారు. ఈ ఏడాది దుర్గమ్మ దేవస్ధాన బడ్జెట్ 178 కోట్లుగా అంచనా వేసినట్లు పాలకమండలి తెలిపింది.












Click it and Unblock the Notifications