ముఖ్యమంత్రి జగన్ విశాఖ కేంద్రంగా మరోసారి..!!
ఇప్పుడు ఏపీలో విశాఖ కేంద్రంగా రాజకీయం ఊపందుకుంది. వచ్చే సెప్టెంబర్ నుంచి విశాఖకు కాపురం మారుస్తానని గతంలోనే ముఖ్యమంత్రి స్పష్టం చేసారు. ఇదే సమయంలో ఈ నెల 3వ తేదీన ముఖ్యమంత్రి జగన్ భోగాపురం విమానాశ్రయంతో పాటుగా ఆదానీ డేటా సెంటర్ కు శంకుస్థాపన చేసారు. ఇప్పుడు మరోసారి ముఖ్యమంత్రి జగన్ విశాఖ వెళ్తున్నారు. రేపు ( గురువారం ) సీఎం జగన్ నగరంలో జరిగే అనేక కార్యక్రమాల్లో పాల్గొంటారు. కీలక ప్రకటనకు అవకాశం కనిపిస్తోంది.
సీఎం జగన్ విశాఖ పర్యటన:ముఖ్యమంత్రి జగన్ గురువారం విశాఖ నగరంలో పర్యటించనున్నారు. పలు అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొని ప్రారంభోత్సవాలు చేయనున్నారు. గురువారం మధ్యాహ్నం 2 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 3.20 గంటలకు విశాఖపట్నం చేరుకుంటారు. అక్కడి నుంచి 3.50 గంటలకు పీఎం పాలెం వైయస్ రాజశేఖరరెడ్డి స్టేడియంకు చేరుకుంటారు, అక్కడ ఏర్పాటు చేసిన దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. సాయంత్రం 4.50 గంటలకు ఆరిలోవ అపోలో ఆస్పత్రికి చేరుకుని, అపోలో కేన్సర్ ఆస్పత్రిని ప్రారంభిస్తారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించిన అనంతరం అక్కడి నుంచి బయలుదేరి 5.50 గంటలకు బీచ్ రోడ్డుకు చేరుకుంటారు.

అభివృద్ది కార్యక్రమాల్లో:అక్కడ వీఎంఆర్డీఏ అభివృద్ది చేసిన సీ హారియర్ యుద్ద విమాన మ్యూజియంను ప్రారంభిస్తారు. దీంతోపాటు అక్కడి నుంచే రామ్‌నగర్‌లోని వీఎంఆర్డీఏ కాంప్లెక్స్, ఎంవీపీలోని ఇండోర్ స్పోర్ట్స్ ఎరీనాను ప్రారంభించనున్నారు. అనంతరం ఎండాడలోని కాపు భవనం, భీమిలిలోని ఫిష్ ల్యాండింగ్ సెంటర్‌కు శంకుస్ధాపన చేయనున్నారు. అక్కడి నుంచి 6.15 గంటలకు బీచ్ రోడ్డులోని ఏయూ కన్వెన్షన్ హాల్లో జరుగుతున్న ఎమ్మెల్యే గొల్ల బాబురావు కుమారుడి వివాహ రిసెప్షన్ వేడుకలో పాల్గొంటారు, అనంతరం రాత్రి 7 గంటలకు తిరుగు ప్రయాణమై 8.20 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. ఈ పర్యటన సమయంలో ముఖ్యమంత్రితో అధికారులు సమావేశం కానున్నారు.
విశాఖ కేంద్రంగా:ఇప్పటికే విశాఖ కేంద్రంగా ముఖ్యమంత్రి జగన్ అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం మూడు రాజధానుల వ్యవహారం సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉంది. న్యాయపరంగా తీర్ప ఆలస్యం అయినా.. ముందుగా విశాఖ నుంచి తన పాలన ప్రారంభించే ఆలోచనలో సీఎం జగన్ ఉన్నారు. అందులో భాగంగా సెప్టెంబర్ నుంచి విశాఖలోనే పాలనా వ్యవహారాలు ప్రారంభించాలని డిసైడ్ అయ్యారు. అక్కడే మంత్రి వర్గ సమావేశాలు నిర్వహించనున్నారు. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ మాత్రం అమరావతిలో కొనసాగనున్నాయి. మూడు రాజధానుల పైన సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా తదుపరి కార్యాచరణ ఏపీ ప్రభుత్వం ఖరారు చేసే అవకాశం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications