బంగాళాఖాతంలో జంట అల్పపీడనాలు: వారం రోజుల గ్యాప్‌లో: ఎడాపెడా కుమ్మేసేలా
విశాఖపట్నం: బంగాళాఖాతంలో జంట అల్పపీడనాలు ఏర్పడనున్నాయి. అరేబియా, బంగాళాఖాతంలో ఇదివరకు ఏర్పడిన తౌక్టే, యాస్ తుఫాన్ల తరువాత అదే స్థాయిలో మరో రెండు తుఫాన్లు ఆవిర్భవించడానికి అనుకూల వాతావరణం ఏర్పడింది. ఈ రెండింటి ప్రభావంతో ఏపీ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, పశ్చిమ బెంగాల్‌లల్లో ఓ మోస్తరు నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు భారత వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ఇప్పటికే- రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తోన్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. తాజాగా ఈ రెండింటి ప్రభావంతో మరిన్ని వర్షాలు పడతాయని పేర్కొంది.
ఈ నెల 21న బంగాళాఖాతం ఉపరితలంలో అల్పపీడనం ఏర్పడబోతోన్నట్లు వాతావరణ కేంద్రం తెలిపింది. వారం రోజుల తరువాత అంటే 27వ తేదీ లోగా మధ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశాలను కొట్టిపారేయలేమని అంచనా వేసింది. దీనికి అనుకూల వాతావరణం బంగాళాఖాతం ఉపరితలంపై నెలకొని ఉందని పేర్కొంది. ఈ రెండింటి ప్రభావంతో పలు రాష్ట్రాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని, ఏపీ కోస్తా తీర ప్రాంత జిల్లాలు, ఉత్తరాంధ్ర, ఒడిశా, ఛత్తీస్ గఢ్, జార్ఖండ్, విదర్భ, పశ్చిమ బెంగాల్‌లోని గంగానదీ తీర ప్రాంతంలో వర్షపాతం నమోదవుతుందని పేర్కొంది.

సముద్రం ఉపరితలానికి రెండు కిలోమీటర్ల ఎత్తున ఈ నెల 21వ తేదీ నాటికి అల్పపీడనం ఏర్పడటానికి అనువైన పరిస్థితులు ఉన్నాయని, క్రమంగా ఇది బలపడుతుందని వాతావరణ కేంద్రం తెలిపింది. అదే సమయంలో 27వ తేదీ నాటికి మరో అల్పపీడనం ఏర్పడటానికి అవకాశాలు ఉన్నాయని, దీని తీవ్రత మరింత అధికంగా ఉండొచ్చని పేర్కొంది. ఈ జంట అల్పపీడనాల ప్రభావంతో వచ్చే అయిదారు రోజుల పాటు ఆయా రాష్ట్రాల్లో భారీ వర్షం కురుస్తుందని అంచనా వేసింది. ఈ తరహా వాతావరణం వల్ల నైరుతి రుతుపవనాలు మరింత చురుగ్గా కదులుతాయని, త్వరగా విస్తరిస్తాయని స్పష్టం చేసింది.












Click it and Unblock the Notifications